తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్
‘22ఏ’ బాధితులకు ఉపశమనం కలిగించే దిశగా సర్కారు కీలక నిర్ణయం
హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్‌ఎంసీ అనుమతులిచ్చిన లే ఔట్‌లు, భవనాలు నిషేధిత జాబితా నుంచి తొలగింపు!
సీఎం నేడు శాసనసభలో ప్రకటించే అవకాశం
సామాన్యులకు ఇబ్బందులు తొలగిపోయేలా దిద్దుబాటు చర్యలు వెల్లడించే చాన్స్
మంత్రులతో సీఎం రేవంత్ చర్చ
నేడు అసెంబ్లీ ప్రారంభానికి ముందు మళ్లీ భేటీ
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల (22ఏ) విషయంలో బాధితులకు ఉపశమనం కలిగించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీప్లానింగ్ (డీటీసీపీ) అనుమతిలిచ్చిన లే ఔట్‌లలోని భూములు కూడా 22ఏ పరిధిలోకి వచ్చిన నేపథ్యంలో.. వాటిని వెంటనే ఆ జాబితా నుంచి తొలగించేలా సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం శాసనసభలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ నుంచి అధికారిక అనుతులున్న వాటికి కూడా ఈ వెసులుబాటు లభించనున్నట్లు సమాచారం. 22ఏ అంశంలో 8 అంశాలను గుర్తించామని, వాటిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై శాసనసభలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించిన విషయం విదితమే. కాగా 22ఏ జాబితా తమను ఇరకాటంలోకి నెట్టిందన్న భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నా.. మరింత స్పష్టతతో సభా వేదికగా దిద్దుబాటు చర్యలు ప్రకటించనున్నట్లు తెలిసింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వివేక్‌లతో సమావేశమయ్యారు. ఈ భేటీలో 22ఏ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.
అప్పట్లో యూఎల్‌సీ నుంచి ఎలా తొలగించారో..?
చిన్న ప్లాట్లు, ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో ఫ్లాట్లు అవసరార్థం విక్రయించడానికి వెళ్లితే.. అవి కాస్తా 22ఏ ఉన్నట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చెబితేనే కానీ యజమానులకు తెలియని పరిస్థితి నెలకొనడంతో ఈ అంశం తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి పలు దఫాలుగా రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. తాజాగా 22ఏకు తుది రూపు ఇవ్వాలన్న ఉద్దేశంతో మంగళవారం సమావేశం నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదని చెబుతున్నా.. అధికారికంగా అనుతులున్న లే ఔట్‌లకు 2007 సంవత్సరం లింక్ డాక్యుమెంట్‌లను పరిశీలించి వాటిని 22ఏ నుంచి తొలగించడం ద్వారా ప్రధాన సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం. దశాబ్దాల కిందట ఇళ్ల నిర్మాణాలు చేసుకున్న వారి స్థలాలను ఇప్పుడు 22ఏలో పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. మునుగోడు ఎన్నిలకు ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ..ఎల్‌బీ నగర్‌లోని పలు కాలనీలు అర్బన్ ల్యాండ్ సీలింగ్(యూఎల్‌సీ) పరిధిలో ఉంటే, వాటిని యూఎల్‌సీ నుంచి తప్పించి ఉత్తర్వులు జారీ చేసింది. అక్కడి ప్రజల నుంచి డబ్బు కట్టించుకున్న నేపథ్యంలో ఏ విధంగా వాటిని యూఎల్‌సీ నుంచి తొలగించారు? అన్న దానిపై మంగళవారం నాటి భేటీలో చర్చించినట్లు తెలిసింది. కాగా ప్రభుత్వం నుంచి పలు అవసరాల కోసం భూములు లీజుకు తీసుకున్న వారు ఆ స్థలాల్లో భవనాలు నిర్మాణాలు చేసుకున్నారని, ఇప్పుడు వారికిచ్చిన లీజు గడువు ముగియడంతో, వాటి లీజును రద్దు చేయడమా? లేక లీజు కొనసాగించడమా.? లేక వారికి విక్రయించడమా అన్న అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
జీవో 59 పై కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ!
ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికి వెయ్యి చదరపు గజాల వరకు క్రమబద్ధీకరణ చేయడానికి జారీ చేసిన జీవో 59 కింది స్థలాలను కూడా ఎలాంటి క్రయ విక్రయాలు జరపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విదితమే. అయితే కొన్నివేల మంది డబ్బు చెల్లించి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జీవో 59 పరిధిలోకి వచ్చే భూములపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ నియమించి, అన్నీ సవ్యంగా ఉంటే వాటిని క్రయ విక్రయాలకు అనుమతించాలని తాజాగా ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఇలాంటి భూములు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్‌లో ఉన్నాయి.
కేబినెట్ సబ్ కమిటీయా? అధికారుల కమిటీనా?
ఇక యూఎల్‌సీ, అస్సైన్డ్ భూముల్లో ఇళ్లు కట్లుకున్నవారు, ఇందిరమ్మ హౌసింగ్ కింద కేటాయించిన ఇంటి స్థలాలు, నాలా మార్పిడి భూములు, ప్రభుత్వ భూముల్లో అనధికారిక లేఔట్‌లతో సమస్యలు, జీవో 118 భూములతో పాటు జీవో 59పై మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించాలా? లేక అధికారుల కమిటీ నియమించాలా? అన్న దానిపైనా ఈ భేటీలో చర్చించారు. ఆ కమిటీకి రెండు మూడు నెలలు గడువునిచ్చి, అచ్చే నివేదికపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అంశంపై చర్చించినట్లు తెలిసింది. మొత్తం మీద బుధవారం మరోసారి అధికారులతో సమావేశం తర్వాత, మంత్రులతోనూ చర్చించి బుధవారం శాసనసభలో సీఎం కీలక ప్రకటన చేస్తారని చెబుతున్నారు.


