కేరళలో 131 మందులపై అధ్యయనం.. అన్నీ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే
బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందులు సగటున 48.6% చౌక
తొలి తయారీ సంస్థ పేటెంట్ గడువు ముగిసిన తరువాత జనరిక్ మందుల తయారీ
సరైన అవగాహన లేకపోవడంతోనే జనరిక్ మందులపై అపోహ
సాక్షి, హైదరాబాద్: బ్రాండెడ్ మందుల నాణ్యతకు జనరిక్ మందులకు ఎలాంటి తేడా లేదని తేలింది. జనరిక్ మందుల నాణ్యతపై ఉన్న అనుమానాలకు కేరళలో జరిగిన తాజా అధ్యయనం ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. జనరిక్ మందులు, బ్రాండెడ్ మందుల మధ్య ఔషధ నాణ్యతలో ఏమాత్రం తేడా లేదని పరిశోధకులు తేల్చారు. కేరళలోని వివిధ లైసెన్స్‌డ్ ఔషధ విక్రయ కేంద్రాల నుంచి సేకరించిన 131 మందుల నమూనాల్లో ఒక్కటి కూడా నాణ్యత ప్రమాణాల్లో విఫలం కాలేదు. మరోవైపు జనరిక్ మందులు బ్రాండెడ్ మందుల కంటే సగటున 48.6 శాతం తక్కువ ధరకు లభించినట్టు గుర్తించారు. ఈ అధ్యయనం అంతర్జాతీయ వైద్య పరిశోధన పత్రిక ‘ఫ్రంటియర్స్ ఇన్ ఫార్మకాలజీ’లో ప్రచురితమైంది. గతంలో కూడా జనరిక్ మందులపై అధ్యయనాలు జరిగినా, మన దేశంలో తాజాగా నిర్వహించిన సర్వే ఇదే కావడం గమనార్హం.
8 విభాగాలకు చెందిన 22 రకాల మందుల ఎంపిక
కేరళలో లివర్ డాక్టర్‌గా ప్రసిద్ధి చెందిన సైరియాక్ అబ్బీ ఫిలిప్స్ నేతృత్వంలోని పరిశోధకులు 8 చికిత్సా విభాగాలకు చెందిన 22 రకాల అత్యవసర మందులను ఈ అధ్యయనం కోసం ఎంపిక చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఔషధ విక్రయ కేంద్రాలు, ప్రైవేటు జనరిక్ దుకాణాలు, బ్రాండెడ్ మందుల దుకాణాలు తదితర 7 రకాల లైసెన్స్‌డ్ విక్రయ కేంద్రాల నుంచి నమూనాలను సేకరించారు. సేకరించిన మందుల్లో జనరిక్, బ్రాండెడ్ జనరిక్, బ్రాండెడ్ మందులు ఉన్నాయి. ప్రతి నమూనాను గుర్తింపు, మోతాదు ఏకరూపత, మందు కరిగే విధానం, మలినాలు, క్రియాశీల ఔషధ పదార్థం పరిమాణం తదితర ప్రమాణాలపై పరీక్షించారు.
ఇందుకోసం ‘ఇండియన్ ఫార్మకోపియా–2022’ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. అధ్యయనంలో పరీక్షించిన 131 నమూనాల్లో 131 మందులు అన్ని నాణ్యత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. అంటే జనరిక్ అయినా, బ్రాండెడ్ అయినా ఔషధంలోని క్రియాశీల పదార్థం పరిమాణం, మోతాదు ఏకరూపత, కరిగే విధానం, మలినాల స్థాయి తదితర అంశాల్లో నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నట్టు తేలాయి. అందువల్ల ధర ఎక్కువగా ఉండటం వల్ల నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయానికి ఆధారం కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు.
సగం ధరకే జనరిక్ మందులు
నాణ్యతలో తేడా లేకపోయినా జనరిక్‌కు బ్రాండెడ్ మందులకు ధరల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. అధ్యయనంలో జనరిక్ మందుల సగటు ధర బ్రాండెడ్ మందులతో పోలిస్తే 48.6 శాతం తక్కువగా ఉంది. బ్రాండెడ్ జనరిక్ మందులతో పోల్చినా జనరిక్ మందులు సగటున 37.1 శాతం తక్కువ ధరకు లభించడం గమనార్హం. కొన్ని సందర్భాల్లో ధర వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉందని, అత్యధిక ధర ఉన్న బ్రాండెడ్ మందు, అత్యల్ప ధర ఉన్న జనరిక్ మందు మధ్య 13.9 రెట్ల వరకు వ్యత్యాసం నమోదైందని పరిశోధకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘జన్ ఔషధి కేంద్రాలు’’కూడా అధ్యయనంలో కీలకంగా నిలిచాయి.
ఇదీ చదవండి: పిల్లల్ని కనడానికి అయిష్టంగా యువతులు!
పరీక్షించిన ఔషధ విభాగాల్లో 81.8 శాతం అత్యల్ప ధరను జన్ ఔషధి కేంద్రాలే అందించినట్టు పరిశోధకులు గుర్తించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులు నిరంతరం మందులు వాడాల్సి ఉండటంతో ధర తగ్గడం వారికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా జనరిక్ మందుల నాణ్యతపై ప్రజల్లోనే కాకుండా వైద్య వర్గాల్లోనూ అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ పరిశోధన చేపట్టినట్టు వారు తెలిపారు.


