దేశంలోని కోట్లాది ఉద్యోగులకు కీలకమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద తప్పనిసరి కవరేజీకి వర్తించే నెలవారీ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సెప్టెంబర్ 16న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన పరిమితి 2026 సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి రానుంది.
ఈ నిర్ణయంతో ప్రస్తుతం నెలకు రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య వేతనం పొందుతున్న కొత్త ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఇకపై తప్పనిసరి ఈపీఎఫ్‌వో కవరేజీ పరిధిలోకి రానున్నారు. కేంద్రం అంచనా ప్రకారం 51 లక్షల మందికి పైగా అదనపు ఉద్యోగులు ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో వారికి ప్రావిడెంట్ ఫండ్ పొదుపుతో పాటు, వర్తించే నిబంధనల ప్రకారం ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS), ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలకు అవకాశం లభిస్తుంది.
బీమా రూ.7 లక్షల నుంచి రూ.10.5 లక్షలకు?
ఈపీఎఫ్‌వో సభ్యులకు అందుబాటులో ఉండే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ప్రస్తుతం గరిష్ఠ బీమా ప్రయోజనం రూ.7 లక్షలుగా ఉంది. నిబంధనల ప్రకారం, 12 నెలల నిరంతర సర్వీస్ ఉన్న సభ్యుడు మరణించిన సందర్భంలో సగటు నెలవారీ వేతనాన్ని 35తో గుణించి, గత 12 నెలల సగటు ఈపీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 శాతాన్ని కలుపుతారు. ఈ బ్యాలెన్స్ ఆధారిత భాగానికి రూ.1.75 లక్షల పరిమితి ఉంది. మొత్తం ప్రయోజనం గరిష్ఠంగా రూ.7 లక్షలకు పరిమితం.
ప్రస్తుతం గరిష్ఠ వేతన పరిమితి రూ.15,000గా ఉన్నందున గరిష్ఠ లెక్కింపు ఇలా ఉంటుంది..
(రూ.15,000 × 35) + రూ.1.75 లక్షలు = రూ.7 లక్షలు
ఇప్పుడు ఈపీఎఫ్‌వో తప్పనిసరి కవరేజీకి వేతన పరిమితిని రూ.25,000కు పెంచిన నేపథ్యంలో, ఇదే రూ.25,000 పరిమితిని ఈడీఎల్‌ఐ బీమా లెక్కింపులోనూ వర్తింపజేస్తే గరిష్ఠ మొత్తం ఇలా ఉంటుంది..
(రూ.25,000 × 35) + రూ.1.75 లక్షలు = రూ.10.50 లక్షలు
అంటే, ఈడీఎల్‌ఐ లెక్కింపులోనూ వేతన పరిమితిని రూ.25,000గా ప్రభుత్వం సవరించినట్లయితే మాత్రమే గరిష్ఠ బీమా ప్రయోజనం రూ.10.5 లక్షలకు చేరే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కేబినెట్ ప్రకటనలో మాత్రం ఈడీఎల్‌ఐ గరిష్ఠ బీమా మొత్తాన్ని రూ.7 లక్షల నుంచి రూ.10.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రత్యేకంగా ప్రకటించలేదు.
అదేవిధంగా, ఈడీఎల్‌ఐ లెక్కింపులోని రూ.1.75 లక్షల ఈపీఎఫ్ బ్యాలెన్స్ భాగాన్ని కూడా ప్రభుత్వం భవిష్యత్తులో పెంచితే గరిష్ఠ బీమా ప్రయోజనం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ భాగానికి రూ.1.75 లక్షల పరిమితి కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ఇల్లు ఆస్తి కాదు.. అప్పుల కుప్ప: కియోసాకి


