త్వరలో ఆటో ఛార్జీల పెంపు: మంత్రి పొన్నం | Auto fares to increase soon | Sakshi
Sakshi News home page

త్వరలో ఆటో ఛార్జీల పెంపు: మంత్రి పొన్నం

Sep 2 2026 1:19 AM | Updated on Sep 2 2026 1:19 AM

Auto fares to increase soon

సహేతుక డిమాండ్‌గా భావించి ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఆటోరిక్షా ఛార్జీలను పెంచేందుకు అనుమతించాలని నిర్ణయించినట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. 2012 తర్వాత ఛార్జీ లను పెంచలేదని, పెంచాలన్న ఆటోవాలాల డిమాండ్‌ సహేతుకమైందేనని భావించి ఛార్జీల పెంపునకు అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రయాణికులపై భారం అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ఆ ఛార్జీలను ఖరారు చేస్తామన్నారు. ఆటోవాలాల డిమాండ్లపై సంఘాలతో చర్చించడం ద్వారా నగరంలో ఆటోల సమ్మె లేకుండా చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై వేయి రోజులయిన సందర్భంగా బస్‌భవన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పలు వివరాలు వెల్లడించారు. 

ప్రస్తుతం నగరంలో తిరుగున్న బైక్‌ ట్యాక్సీల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకోబోతు న్నామని, కేవలం పసుపు రంగు నంబర్‌ ప్లేట్‌ ఉంటేనే బైక్‌ ట్యాక్సీగా అనుమతించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నా మని వెల్లడించారు. రెండు వేతన సవరణల అమలు జరిగినా, ఉద్యోగ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు వాటి బకాయిలతోపాటు మరికొన్ని ఆర్థిక ప్రయోజనాల మొత్తం చెల్లించకపోవటంపై కూడా ఆయన స్పందించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి మేరకు వారి బకాయిల చెల్లింపులో కొంత జాప్యం తప్పదని, కానీ, వారికి కూడా అన్ని ప్రయోజనాల మొత్తం చెల్లిస్తామని, అప్పటి వరకు వారు ఓపికగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. 

ఏ నియోజకవర్గంలోని నిరుపేదలకు అదే నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలన్న నిర్ణయం మేరకు, ఆర్టీసీకి చెందిన కొన్ని స్థలాలను సేకరించామని పేర్కొన్నారు. సంస్థకు ప్రభుత్వం వేరే చోట పెద్ద మొత్తంలో స్థలం కేటాయిస్తున్నందున, పేదల అవసరాల కోసం ఆర్టీసీ స్థలాలను ప్రభుత్వం తీసుకోవడం తప్పు కాదన్నారు. కొత్తగా వేయి మంది డ్రైవర్లు, 743 మంది శ్రామిక్‌ల నియామక ప్రక్రియ పూర్తి చేసినట్లు వెల్లడించారు. 

త్వరలో వీరికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్, క్యాబ్, ఆటో, బైక్‌ ట్యాక్సీల సేవలన్నీ ఒకేచోట లభించేలా మీసేవ ఆధ్వర్యంలో యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, రవాణాశాఖ కమిషనర్‌ ఇలంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జేటీసీ చంద్రశేఖర్‌గౌడ్, ఆర్టీసీ ఈడీలు వెంకన్న, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement