breaking news
wage limit
-
తెరపైకి ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వేతన పరిమితి త్వరలో పెరిగే అవకాశం ఉంది. పదకొండేళ్ల క్రితం తర్వాత మరోసారి ఈ పరిమితిని పెంచేందుకు కేంద్ర కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. వేతన పరిమితి పెంపుతో ఉద్యోగుల సామాజిక భద్రతకి మరింత ధీమా కలగడంతోపాటు పదవీ విరమణ సమయంలో ఉద్యోగికి అందే ఆర్థిక లబ్ధి కూడా భారీగా పెరగనుంది. వేతన పరిమితిని చివరిసారిగా 2014లో రూ.6,500 నుంచి 15 వేలకు పెంచారు. ఆ తర్వాత ఇప్పటివరకు పెంపుదలపై ఎలాంటి చర్చలు జరగలేదు. ఈ అంశంపై ఇటీవల పార్లమెంటులో పలువురు సభ్యులు లేవనెత్తగా... అందుకు స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ‘ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకోదు. వాటాదారులతో చర్చించాలి. అంతేకాకుండా కార్మిక సంఘాలు, పారిశ్రామిక సంఘాలతోనూ చర్చలు జరపాల్సి ఉంటుంది. అయితే పెంపు అంశంపై మాత్రం కేంద్రం సానుకూలంగా ఉంది’ అని చెప్పారు. దీంతో ఒక్కసారిగా వేతన పెంపు అంశం తెరపైకి వచ్చింది.30వేల వరకు పెంచాలంటున్న సంఘాలుఈపీఎఫ్ 1995లో అమల్లోకి వచ్చిన సమయంలో ఈపీఎఫ్ వేతన పరిమితి రూ.5వేలుగా ఉంది. ఆ తర్వాత 2001లో అప్పటి జీవన వ్యయం, వేతనాల స్థితికి అనుగుణంగా వేతన పరిమితిని రూ.6,500కు పెంచారు. 13 ఏళ్ల తర్వాత దీన్ని రూ.15వేలకు పెంచారు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఇప్పుడు ఉద్యోగాల్లో చేరే వారికి కనీస వేతనం రూ.20వేల కంటే ఎక్కువగా ఉంది. దీంతో ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు అనివార్యమని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వేతన పరిమితిని రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వేతన పరిమితి పెంపుతో ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చేస్తారు. అంతేకాకుండా ఈపీఎఫ్ ఉద్యోగుల పొదుపు మరింత పెరుగుతుంది. యాజమాన్యాలపై కొంత భారం పడినప్పటికీ... ఉద్యోగులకు మాత్రం పీఎఫ్‌లో భారీగా పొదుపు ఉంటుందనేది కార్మిక సంఘాల నేతల అభిప్రాయం. అయితే వేతన పెంపు అంశంపై ఈపీఎఫ్ఓ ఆధ్వర్యంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. సీబీటీ సమావేశం ఇప్పటివరకు షెడ్యూల్ కాలేదు. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే రెగ్యులర్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
ఉద్యోగులకు శుభవార్త.. ఈఎస్ఐ వేతన పరిమితి పెంపు
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పరిధిలోని చందాదారులకు కేంద్రం శుభవార్త చెప్పంది. ఈఎస్ఐ గరిష్ట వేతన పరిమితి 2016కు ముందు రూ.15 వేలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.21 వేలకు పెంచింది. ఈ తరహాలోనే ఈపీఎఫ్ఓ కూడా వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచే యోచనలో ఉందని ప్రాథమిక సమాచారం. ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్మిక సంఘాలు, అనుబంధ సంస్థలు ఇందుకోసం గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వేతన పరిమితి పెంపుతో జరిగే పరిణామాలపై కేంద్ర కార్మిక శాఖ ప్రాథమిక కసరత్తుకు ఉపక్రమించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈపీఎఫ్ చందాదారుడి గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. 2014కు ముందు ఇది రూ.6,500 కాగా.. అప్పటి ప్రభుత్వం ఈ పరిమితిని రూ.15 వేల వద్ద ఫిక్స్ చేసింది. ఈపీఎఫ్ఓ ఫార్ములా ప్రకారం ఒక ఉద్యోగికి భవిష్యనిధి చందా కింద 12 శాతం యాజమాన్యం చెల్లిస్తుండగా, మరో 12 శాతం ఉద్యోగి వేతనం నుంచి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని (పెన్షన్ మినహా) ఉద్యోగి పదవీ విరమణ సమయంలో వడ్డీతో సహా ఈపీఎఫ్ఓ తిరిగి ఇచ్చేస్తుంది. ఉద్యోగికి లాభం..యాజమాన్యాలపై భారం చందాదారుడి గరిష్ట వేతన పరిమితి పెంపుతో ఉద్యోగికి లాభం కలగనుండగా.. అధిక చెల్లింపుల భారం యాజమాన్యాలపై పడనుంది. ప్రస్తుత ఫార్ములా ప్రకారం ఉద్యోగి గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలు కాగా అందులో 12 శాతాన్ని (రూ.1800) యాజమాన్యం సదరు ఉద్యోగి ఈపీఎఫ్ఓ ఖాతాకు బదిలీ చేస్తుంది. ఇందులో నుంచి 8.33 శాతం(రూ.1250) పెన్షన్ ఖాతాకు బదిలీ అవుతుండగా... మిగతా 3.67 శాతం (రూ.550) మొత్తం భవిష్యనిధి ఖాతాలో జమ అవుతుంది. దీనికి సమానంగా ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం (రూ.1800) భవిష్యనిధి ఖాతాలో జమ చేస్తారు. తాజాగా ఉద్యోగి వేతన పరిమితి రూ.21 వేలకు పెంచితే ఇందులోని 12 శాతం (రూ.2520) యాజమాన్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ లెక్కన ఉద్యోగి పెన్షన్ ఖాతాలో రూ.1790, భవిష్య నిధి ఖాతాలో రూ.730 జమ అవుతాయి. దీనికి సమానంగా ఉద్యోగి వేతనం నుంచి రూ.2520 భవిష్యనిధి ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం ఈఎస్ఐ చట్టం కింద చందాదారుడి గరిష్ట వేతన పరిమితి రూ.21 వేలుగా ఉంది. రూ.21 వేలు దాటిన వారు ఈఎస్ఐ పరిధిలోకి రారు. ఈఎస్ఐ గరిష్ట వేతన పరిమితి 2016కు ముందు రూ.15 వేలు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం దీన్ని రూ.21 వేలకు పెంచింది. ఈ తరహాలోనే ఈపీఎఫ్ఓ కూడా వేతన పరిమితిని రూ.21 వేలకు పెంచే యోచనలో ఉందని ప్రాథమిక సమాచారం. కాగా ఇందుకు సంబంధించి ఈపీఎఫ్ఓ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
వేతనపరిమితి పెంపు యోచనలో ఈపీఎఫ్‌వో
న్యూఢిల్లీ: వేతన పరిమితిని నెలకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు పెంచాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) యోచిస్తోంది. దీని వల్ల మరో కోటి మంది ఉద్యోగులు ఈపీఎఫ్ పరిధిలోని సామాజిక భద్రతా పథకాలను వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. గురువారం జరిగిన ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి సమావేశానికి సంబంధించిన ఎజెండాలో ఈ ప్రతిపాదనను చేర్చారు. అయితే దీనిపై చర్చ జరగలేదు. ట్రస్టీ డీఎల్ సచ్దేవ్ మాట్లాడుతూ.. సమయాభావం వల్ల చర్చించలేదని, ఈ నెలాఖరులో జరిగే భేటీలో చర్చిస్తామని చెప్పారు. కాగా, ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వంపై రూ.2,700 కోట్ల అదనపు భారం పడే అవకాశముంది. దాదాపు 4 కోట్ల మంది ఈపీఎఫ్‌వో చందాదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రసుత్తం రూ.6,700 కోట్లు వెచ్చిస్తోంది. -
కనీస పెన్షన్ అమలు
వేతన పరిమితి పెంపుపైనా ఈపీఎఫ్‌వో చర్యలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు పీఎఫ్ ఖాతాదారులకు కనిష్ట వేతన పరిమితి, కనీస పింఛను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) తన సిబ్బందిని ఆదేశించింది. ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే కనిష్ట వేతన పరిమితిని ప్రస్తుతమున్న రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు పెంచుతున్నట్లు, అలాగే ఉద్యోగుల పెన్షన్ పథకం(ఈపీఎస్) కింద పెన్షనర్లకు కనీసం వెయ్యి రూపాయల పింఛను అందిస్తామని ఇటీవలి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ దిశగా ఈపీఎఫ్‌వో సంస్థ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదలకానుందని, ఈ నిర్ణయాల అమలు దిశగా చర్యలు తీసుకోవాలని తన సిబ్బందిని ఆదేశిస్తూ ఈపీఎఫ్‌వో కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి సర్వీస్ కాలంలోని చివరి 60 నెలల్లో పొందిన సగటు జీతాన్ని బట్టి పెన్షన్ మొత్తాన్ని లెక్కిస్తారు. ఇక పీఎఫ్ పరిధిలోకి వచ్చే కనిష్ట వేతన పరిమితిని కూడా పెంచిన నేపథ్యంలో అంతకన్నా అధిక మూల వేతనం పొందుతున్న ఉద్యోగులు ఆ మేరకు ఎక్కువ పీఎఫ్‌ను చెల్లించే విషయంపై అభిప్రాయాలు తీసుకోవాలని, వారి నిర్ణయాన్ని 6 నెలల్లో అమలు చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఈపీఎఫ్‌వో ఆదేశించింది. వేతన పరిమితి పెంపు వల్ల మరో 50 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్‌వో పరిధిలోకి రానున్నారు. అలాగే రూ. వెయ్యి కనీస పింఛ ను నిర్ణయం వల్ల దాదాపు 28 లక్షల మంది పెన్షనర్లు లబ్ధిపొందనున్నారు. కాగా, కనీసం పది మంది ఉద్యోగులున్న సంస్థలను ఈపీఎఫ్‌వో పరిధిలోకి తేచ్చే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. ప్రస్తుతం కనీసం 20మంది ఉద్యోగులున్న సంస్థలకే పీఎఫ్‌ను వర్తింపజేస్తున్నారు. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని యోచిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి విష్ణుదేవ్ సాయి రాజ్యసభలో ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అసంఘటిత రంగంలోని కార్మికులను ఈపీఎఫ్‌వో పరిధిలోకి తెచ్చే ఆలోచనేదీ ప్రస్తుతానికి లేదని కూడా తెలిపారు.


