సాధారణంగా.. జీవితంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లేవాళ్లను చాలామంది నమ్మరు. ఒకసారి ఆ ఆలోచనలతో సక్సెస్ అయితే.. ప్రపంచం మొత్తం తమవైపే చూస్తుంది. దీనికి నిలువెత్తు నిదర్శనమే విక్టర్ రిపార్బెల్లీ (Victor Riparbelli). ఇంతకీ ఈయన ఎవరు?, ఈయన సాధించిన సక్సెస్ ఏమిటి?, అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ఏఐ ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి చాలా సంవత్సరాల ముందే.. ఏఐతో వీడియోలు తయారు చేయవచ్చని విక్టర్ రిపార్బెల్లీ నమ్మాడు. కానీ ఆ సమయంలో.. తన మాటలను, ఆలోచనలను చాలామంది నమ్మలేదు. తాను నిర్మించాలనుకున్న స్టార్టప్ కోసం పెట్టుబడులు సేకరించే క్రమంలో, దాదాపు 100 మంది ఇన్వెస్టర్ల నుంచి తిరస్కరణకు గురయ్యాడు. అయినప్పటికీ.. ఏ మాత్రం నిరాశ చెందలేదు. తన ఆలోచన తప్పకుండా ఒక రోజు ఫలిస్తుందని గట్టిగా నమ్మి.. ముందుకు వెళ్ళాడు.
తన ఆలోచనకు కార్యరూపం దాల్చడానికి.. రిపార్బెల్లీ 2017లో లండన్‌లో 'సింథేసియా' పేరుతో ఒక కంపెనీ ప్రారంభించాడు. ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే.. మనం రాసిన టెక్స్ట్‌ను ఆధారంగా చేసుకొని ఏఐ సహాయంతో నిజమైన మనుషుల్లా కనిపించే వీడియోలను రూపొందించడం.
ప్రారంభంలో.. ఈ సాంకేతికతపై ఎవరూ పెద్దగా ఆసక్తి కనిపించలేదు. కానీ ఆ తరువాత కంపెనీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించింది. వినోద రంగం కంటే వ్యాపార సంస్థలకు ఈ టెక్నాలజీ ఎక్కువ ఉపయోగపడుతుందని అర్థం చేసుకుంది. ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, కొత్త ఉద్యోగులకు సంస్థ గురించి వివరించడం, అంతర్గత సమాచారాన్ని పంచుకోవడం వంటి పనుల కోసం ఏఐ వీడియోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని గ్రహించింది.
ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలు కెమెరాలు, నటీనటులు లేదా చిత్రీకరణ బృందం అవసరం లేకుండానే ఏఐ అవతార్‌లతో నాణ్యమైన వీడియోలను తయారు చేస్తున్నాయి. దీనివల్ల సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతున్నాయి. ఈ వినూత్న ఆలోచన కారణంగా సింథేసియా కంపెనీ విలువ 4 బిలియన్ డాలర్లకు (రూ.38 వేలకోట్లు) చేరుకుంది. ప్రస్తుతం ఇది యూరప్‌లోని అత్యంత విజయవంతమైన ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది.
గొప్ప ఆలోచనలు మొదట్లో చాలా మందికి అర్థం కావు. కాబట్టి అందరూ.. మీ ఆలోచనను వెంటనే నమ్మాలని ఆశించకూడదు. విజయాన్ని సాధించాలంటే విమర్శలు, తిరస్కరణలు, అపజయాలు అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వం అవసరం. మనపై మనకు నమ్మకం ఉంటే, సరైన సమయంలో కష్టానికి తప్పకుండా ఫలితం లభిస్తుందని విక్టర్ రిపార్బెల్లీ చెబుతారు.
ఇదీ చదవండి: అతిపెద్ద మార్కెట్ క్రాష్ వస్తుందా?.. కియోసాకి చెప్పేది నిజమేనా?


