ఆస్తి పంచాయితీల్లో పోలీసులు జడ్జీలు కాకూడదు
దేశంలో స్థిరాస్తుల హక్కులు, సరిహద్దుల తగాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు బాధితులు తరచూ పోలీసులను ఆశ్రయించడం లేదా కొన్ని సందర్భాల్లో పోలీసులు నేరుగా జోక్యం చేసుకుని నోటీసులు జారీ చేయడం, ఒక పక్షాన నిలవడం వంటి పరిణామాలు చూస్తుంటాం. అయితే, కేవలం సివిల్ స్వభావం కలిగిన ఆస్తి వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవచ్చా? ఈ అంశంపై భారత రాజ్యాంగం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టుల స్పష్టమైన తీర్పులు ఏమి చెబుతున్నాయో చూద్దాం.
కోర్టులకే పూర్తి అధికారం
ఆస్తి యాజమాన్య హక్కులు (Title Dispute), స్వాధీనం (Possession), హద్దులు లేదా వారసత్వ వివాదాలు పూర్తిగా సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయి. భారత రాజ్యాంగం ప్రకారం పౌరుల మధ్య ఉండే పౌర హక్కుల వివాదాలను విచారించి పరిష్కరించే అధికారం కేవలం న్యాయవ్యవస్థకు మాత్రమే ఉంది. సివిల్ కోర్టుల్లో విచారణలో ఉన్న అంశాలపై పోలీసులు స్వయంగా పంచాయితీలు చేయడం, ఒక పక్షాన్ని ఖాళీ చేయించడం లేదా భూమి విషయంలో నిర్ణయాలు తీసుకోవడం చట్టవిరుద్ధం.
పోలీసులు ఎప్పుడు జోక్యం చేసుకోవచ్చు? (మినహాయింపు)
సివిల్ వివాదాల్లో పోలీసుల పాత్ర అత్యంత పరిమితం. కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే పోలీసులు చట్టబద్ధంగా ఈ అంశంలో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆస్తి వివాదం నెపంతో అక్రమ ప్రవేశం, బెదిరింపులు, దాడి లేదా ఆస్తి ధ్వంసం వంటి క్రిమినల్ నేరాలు జరిగినప్పుడు మాత్రమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు.
వివాదం తీవ్రరూపం దాల్చి భౌతిక దాడులు లేదా శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు శాంతి పరిరక్షణ కోసం నిరోధక చర్యలు తీసుకోవచ్చు.
సివిల్ కోర్టు లేదా హైకోర్టు నిర్దిష్టంగా పోలీస్ ప్రొటెక్షన్ కల్పిస్తూ ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ ఆదేశాలను అమలు చేయడానికి పోలీసు బలగాలు సహకరించాలి.
న్యాయస్థానాల హెచ్చరికలు
ఇటీవల అల్లాహాబాద్ హైకోర్టుతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు తమ తీర్పుల్లో ‘సివిల్ వివాదాల్లో పోలీసులు జడ్జిలుగా వ్యవహరించకూడదు’ అని స్పష్టం చేశాయి. చట్టపరిధి దాటి సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలతో పాటు కోర్టు ధిక్కరణ చర్యలు కూడా తీసుకుంటామని కోర్టులు హెచ్చరించాయి.
బాధితులు ఏమి చేయాలి?
ఆస్తి వివాదం ఎదురైనప్పుడు పోలీసులపైనే ఆధారపడకుండా తగిన ఆధారాలతో సివిల్ కోర్టును ఆశ్రయించి ‘ఇంజెక్షన్ ఆర్డర్’ లేదా 'స్టే' పొందడమే చట్టబద్ధమైన పరిష్కారం. ఒకవేళ పోలీసులు అక్రమంగా జోక్యం చేసుకుని వేధిస్తుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందవచ్చు.
ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే..


