అంతర్జాతీయ సంక్షోభాలు, యుద్ధాలు, సరఫరా మార్గాల్లో అంతరాయాల సమయంలో దేశంలో ఇంధన కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం భారీ వ్యూహాత్మక ఇంధన నిల్వలను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రధానంగా ముడి చమురు నిల్వలపై దృష్టి పెట్టిన భారత్.. తొలిసారిగా ఎల్పీజీ (LPG), ఎల్ఎన్‌జీ (LNG) కోసం కూడా వ్యూహాత్మక నిల్వలను ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం వినియోగదారులపై ప్రత్యేక లెవీ విధించే ప్రతిపాదనను పెట్రోలియం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
ఎల్‌పీజీపై కిలోకు రూ.1.29 లెవీ?
ప్రతిపాదన ప్రకారం వంట గ్యాస్ వినియోగంపై కిలోకు రూ.1.29 చొప్పున లెవీ విధించే అవకాశం ఉంది. ప్రస్తుత వినియోగ స్థాయిల ఆధారంగా దీనివల్ల ఏడాదికి సుమారు 460 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4,000 కోట్లకు పైగా) ఆదాయం సమకూరవచ్చని అంచనా. ఈ లెవీ అమలైతే సాధారణ గృహ ఎల్పీజీ సిలిండర్‌పై సుమారు రూ.18 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది.
సహజ వాయువుపైనా అదనపు భారం
సహజ వాయువు వినియోగంపై కూడా ప్రత్యేక సుంకం విధించే ప్రతిపాదన ఉంది. ప్రతి స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (SCM)కు రూ.1.43 చొప్పున లెవీ విధిస్తే ప్రస్తుత వినియోగం ఆధారంగా ఏడాదికి దాదాపు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9,000–10,000 కోట్లు) సమీకరించవచ్చని అంచనా. ఎల్పీజీ, సహజ వాయువుపై ప్రతిపాదిత లెవీల ద్వారా కలిపి ఏడాదికి సుమారు 1.5 బిలియన్ డాలర్ల నిధులు సమకూరే అవకాశం ఉంది.
గ్యాస్ బిల్లులు 2 శాతం పెరిగే అవకాశం
ఈ అదనపు లెవీల ప్రభావంతో గృహాలు, ఇతర వినియోగదారుల గ్యాస్ బిల్లులు సుమారు 2 శాతం వరకు పెరగవచ్చని నివేదిక పేర్కొంది. ఇప్పటికే ఇంధన ధరలపై వినియోగదారుల్లో ఆందోళనలు ఉన్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన రాజకీయంగా సున్నితమైన అంశంగా మారే అవకాశం ఉంది. అయితే సుంకాన్ని ఎలా వసూలు చేయాలనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
రూ.4 లక్షల కోట్లతో ప్రణాళిక
భారత్ రాబోయే దశాబ్దంలో బహుళ ఇంధన వ్యూహాత్మక నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు 42 బిలియన్ డాలర్లు, అంటే ప్రస్తుత మారక విలువల ప్రకారం దాదాపు రూ.4 లక్షల కోట్లుగా అంచనా. ఇందులో సగానికి పైగా నిధులను నిల్వ మౌలిక సదుపాయాల నిర్మాణానికి, మిగిలిన మొత్తాన్ని నిల్వ చేయాల్సిన ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి వినియోగించే అవకాశం ఉంది.


