టీవీఎస్ మోటార్ కంపెనీ తన స్కూటర్ లైనప్‌లో పలు మోడళ్ల ధరలను పెంచింది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు పెట్రోల్ స్కూటర్ల ధరలను కూడా సవరించింది. కొన్ని వేరియంట్లపై గరిష్ఠంగా రూ.11,000 వరకు ధర పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన ఆర్బిటర్ శ్రేణి కూడా ఖరీదైంది. మరోవైపు జూపిటర్ 110, జూపిటర్ 125, ఎన్‌టార్క్ 125 మోడళ్ల ధరలను కూడా కంపెనీ పెంచింది.
ఐక్యూబ్ ధరలు ఇలా..
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లలో 3.5kWh మోడల్‌పై అత్యధిక పెంపు నమోదైంది. దీని ధర రూ.1.33 లక్షల నుంచి రూ.1.42 లక్షలకు పెరిగింది. అంటే రూ.9,000 పెరిగింది. బేస్ 2.2kWh ఐక్యూబ్ ధర రూ.1.11 లక్షల నుంచి రూ.1.16 లక్షలకు చేరింది. ఐక్యూబ్ ఎస్ (4.7kWh) ధర రూ.1.55 లక్షల నుంచి రూ.1.61 లక్షలకు పెరిగింది. ఇక టాప్-స్పెక్ ఐక్యూబ్ ఎస్‌టీ (5.3kWh) ధర రూ.1.72 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు చేరింది. అయితే 3.1kWh ఐక్యూబ్ ధర రూ.1.33 లక్షల వద్ద ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతోంది.
ఆర్బిటర్‌పై అత్యధికం
టీవీఎస్ కొత్త ఆర్బిటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ల ధరలు అత్యధికంగా పెరిగాయి. ఆర్బిటర్ వి1 ధర రూ.88,250 నుంచి రూ.99,250కు చేరింది. అంటే రూ.11,00 పెరిగింది. ఆర్బిటర్ వి2 ధర రూ.1.05 లక్షల నుంచి రూ.1.14 లక్షలకు పెరిగింది. ఈ వేరియంట్‌పై రూ.9000 పెంపు నమోదైంది. ఇవి ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు.
జూపిటర్ 110, 125 ధరల పెంపు
పెట్రోల్ స్కూటర్లలో టీవీఎస్ జూపిటర్ 110 ధరలు కూడా పెరిగాయి. వేరియంట్‌ను బట్టి రూ.575 నుంచి రూ.1,950 వరకు పెంపు నమోదైంది. దీంతో ఈ స్కూటర్ ధరల శ్రేణి రూ.73,975 నుంచి రూ.88,850కు చేరింది.
జూపిటర్ 125 మోడల్ ధరలు కూడా రూ.875 నుంచి రూ.2,410 వరకు పెరిగాయి. ప్రస్తుతం ఈ స్కూటర్ ధరలు రూ.81,110 నుంచి రూ.89,935 వరకు ఉన్నాయి.
ఎన్‌టార్క్ 125 ధరలూ పెరిగాయి
స్పోర్టీ లుక్‌తో యువతలో మంచి ఆదరణ ఉన్న ఎన్‌టార్క్ 125 డిస్క్ వేరియంట్ ధర రూ.82,500 నుంచి రూ.83,350కు పెరిగింది. అంటే రూ.850 పెరిగింది. ఎన్‌టార్క్ 125 రేస్ ఎడిషన్ ధర కూడా రూ.87,950 నుంచి రూ.88,800కు చేరింది.
వేరియంట్‌ను బట్టి పెంపు మారుతున్నందున కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు బుకింగ్‌కు ముందు తాజా ధరలను డీలర్ వద్ద నిర్ధారించుకోవడం మంచిది.


