ప్రాణం విలువ రూ.3.5 లక్షలు! | Police and Telugu Desam leaders paid a price for Subramaniam life | Sakshi
Sakshi News home page

ప్రాణం విలువ రూ.3.5 లక్షలు!

Jul 30 2026 4:54 AM | Updated on Jul 30 2026 4:54 AM

Police and Telugu Desam leaders paid a price for Subramaniam life

పోలీసుల ఒత్తిడి మేరకు బలవంతంగా ప్రామిసరీ నోటులో సంతకం పెడుతున్న ఫిర్యాదుదారుడు సంజీవ హరి

సుబ్రమణ్యం ఆత్మహత్యకు ధరకట్టిన దారుణం   

తమ తప్పు బయటకు రాకుండా చూసుకున్న పోలీసులు   

మృతుడి కుటుంబానికి రూ.3.5 లక్షలు  

ఫిర్యాదీ, జనసేన మండల అధ్యక్షుడు హరి ఇచ్చేలా ప్రామిసరీ నోట్లు రాయించిన వైనం  

ఇందులో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారి, టీడీపీ నేత, హెడ్‌ కానిస్టేబుల్‌

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువుకు చెందిన సంజీవ సుబ్రమణ్యం ప్రాణా­నికి పోలీసులు, తెలుగుదేశం నాయకులు వెలకట్టారు. అతడి కుటుంబానికి రూ.3.5 లక్షలు ఇచ్చేలా ఫిర్యాదీ, జనసేన మండల అధ్యక్షుడు సంజీవ హరితో ప్రామిసరీ నోట్లు రాయించారు. అంతేగాక గ్రామస్తులు వద్దంటున్నా వినకుండా మంగళవారం చీకటిపడిన తరువాత మృతదేహాన్ని దహనం చేయించారు. చిన్న విషయమై హరి ఇచ్చిన ఫిర్యాదుతో సుబ్రమణ్యాన్ని పోలీసులు తీవ్రంగా కొట్టటం, ఈ అవమానం భరించలేక అతడు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. 

ఈ కేసు తమ మెడకు చుట్టుకుంటుందనే భయంతో పోలీసులు.. బాధిత కుటుంబానికి హరితో డబ్బులు ఇప్పించి, కేసును మాఫీ చేసేందుకు సిద్ధమయ్యారు. సుబ్రమణ్యం మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం మంగళవారం తిరుపతి రుయా ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేలోపే.. ఆ కుటుంబానికి రూ.3.50 లక్షలు ఇచ్చేలా హరిని ఒప్పించి ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించారు. ఈ వ్యవహారంలో పోలీసుశాఖ జిల్లాస్థాయి అధికారి ఒకరు, టీడీపీ మండల అధ్యక్షుడు తిరుమలరెడ్డి, రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ రాజశేఖర్‌ కీలకంగా వ్యవహరించినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. సుబ్రమణ్యాన్ని తీవ్రంగా కొట్టడంలో రామచంద్రాపురం ఎస్‌ఐ, సీఐల పాత్ర ఉందని పేర్కొంటున్నారు.  

సంప్రదాయానికి విరుద్ధంగా అంత్యక్రియలు  
తిరుపతి రుయా ఆస్పత్రి నుంచి సుబ్రమణ్యం మృతదేహాన్ని మంగళవారం చీకటిపడే సమయానికి గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామ సంప్రదాయం ప్రకారం చీకటిపడిన తరువాత అంత్యక్రియలు చేయరాదని గ్రామస్తులు పోలీసులకు చెప్పారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. వారే కట్టెలు తెప్పించి వెంటనే దహనం చేయించేశారు. సుబ్రమణ్యం మృతదేహం మీద లాఠీ దెబ్బల గుర్తులు ఉన్నందున పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులపై చర్యలు తీసుకుంటారా లేక మృతుడి కుటుంబసభ్యుల నుంచి తమకు అనుకూలంగా స్టేట్‌మెంట్‌ తీసుకుని వదిలేస్తారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement