దేశంలో పెరుగుతున్న రహదారి ప్రమాదాలు ఒకవైపు కాగా, ప్రమాద బాధితులకు చట్టబద్ధంగా దక్కాల్సిన నష్టపరిహారం అందకుండా పోతుండటం తీవ్ర ఆందోళనకరమైన అంశం. దీనికి ప్రధాన కారణం దేశంలోని రహదారులపై తిరుగుతున్న వాహనాల్లో దాదాపు 56 శాతం వాహనాలకు చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ బీమా (ఇన్సూరెన్స్) లేకపోవడమే. పార్లమెంటరీ కమిటీ, అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలో నమోదైన 30.48 కోట్ల వాహనాల్లో ఏకంగా 16.54 కోట్ల వాహనాలు (ప్రధానంగా ద్విచక్ర వాహనాలు) ఎటువంటి ఇన్సూరెన్స్ కవరేజ్ లేకుండానే యథేచ్ఛగా రోడ్డెక్కుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
‘నో ఇన్సూరెన్స్.. నో ఫ్యూయల్’ పైలట్ ప్రాజెక్ట్
జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 146 అమలుపై కీలక తీర్పు ఇచ్చింది. చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం (పెట్రోల్/డీజిల్) విక్రయించకుండా నిరోధించేలా ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను రూపొందించాలని బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏఐ), కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. ఈ ప్రతిపాదనకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
సాంకేతికతతో ఆటోమేటిక్ ఈ-చలాన్లు
ఇంధన విక్రయాల నిలిపివేతకే పరిమితం కాకుండా సాంకేతికతను జోడించాలని కోర్టు స్పష్టం చేసింది. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ఉన్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను 'వాహన్' పోర్టల్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటాబేస్‌తో అనుసంధానించాలని ఆదేశించింది. దీనిద్వారా బీమా లేని వాహనాలు రహదారిపైకి రాగానే ఆటోమేటిక్‌గా గుర్తించి వాహనదారుల మొబైల్ ఫోన్లకు ఈ-చలాన్లు వెళ్తాయి. తనిఖీల కోసం ట్రాఫిక్ పోలీసులకు డిజిటల్ హ్యాండ్‌హెల్డ్ పరికరాలు/యాప్‌లు అందుబాటులోకి తేనున్నారు.
ఇదీ చదవండి: మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు


