దేశంలో డిజిటల్ విప్లవంతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) రోజువారీ లావాదేవీలకు ప్రధాన ఆధారంగా మారింది. అయితే, ఇదే సాంకేతికతను ఆసరాగా చేసుకుని డిజిటల్ మోసగాళ్లు కొత్త రకం సైబర్ నేరాలకు తెరలేపుతున్నారు. చెల్లింపు పూర్తయినట్లు చూపించే ‘నకిలీ స్క్రీన్‌షాట్‌ల’ ద్వారా వ్యాపారులను, సాధారణ వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్న ఘటనలు ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి.
మోసం ఎలా జరుగుతోంది?
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి ప్రముఖ యూపీఐ యాప్‌ల తరహాలోనే కనిపించే అనేక ఫేక్ పేమెంట్ ప్రాంక్ యాప్‌లు (స్పూఫ్ యాప్స్) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. సైబర్ కేటుగాళ్లు వీటిని ఉపయోగించి వ్యాపారి పేరు, ఫోన్ నంబర్, పంపాల్సిన మొత్తం, తేదీ, సమయాన్ని దాఖలు చేసి క్షణాల్లో నిజమైన పేమెంట్ సక్సెస్ స్క్రీన్ తరహాలోనే ఉండే నకిలీ స్క్రీన్‌షాట్‌ను క్రియేట్ చేస్తున్నారు. కస్టమర్ తమ ఫోన్ స్క్రీన్‌పై ఆ సందేశాన్ని చూపించి డబ్బులు జమ అయినట్లు నమ్మించి వస్తువులతో పరారవుతున్నారు.
నకిలీ చెల్లింపులను గుర్తించడం ఎలా?
కొనుగోలుదారుడి ఫోన్ స్క్రీన్‌పై Payment Successful అని చూపిస్తే.. మీ సొంత యూపీఐ యాప్‌లోని Transaction Historyని సరిచూసుకోండి.
కొందరు మెసేజ్ పంపినట్లు నకిలీ SMS నోటిఫికేషన్లు సృష్టిస్తారు. ఆ సమయంలో మీ బ్యాంక్ నుంచి వచ్చే అధికారిక SMS, సౌండ్ బాక్స్ నోటిఫికేషన్‌పైనే ఆధారపడాలి.
ఇంకొందరు ఆదరాబాదరాగా వ్యాపారిని నమ్మించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వ్యాపార సముదాయాల్లో పేటీఎం/ఫోన్‌పే సౌండ్ బాక్స్ ఏర్పాటు చేయడం ఉత్తమం.
ఫేక్ యాప్‌ల ద్వారా రూపొందించిన స్క్రీన్‌షాట్లను జాగ్రత్తగా పరిశీలిస్తే అక్షరాల పరిమాణం (ఫాంట్ సైజ్), రంగు, అలైన్‌మెంట్, యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీ ఫార్మాట్‌లో స్పష్టమైన తేడాలు కనిపిస్తాయి.
ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే..


