గూగుల్ పేలో SBI కొత్త క్రెడిట్ కార్డు.. | Google Pay Flex SBI Credit Card Launch Rewards, Fee Benefits | Sakshi
Sakshi News home page

గూగుల్ పేలో SBI కొత్త క్రెడిట్ కార్డు..

Jul 30 2026 4:54 PM | Updated on Jul 30 2026 5:03 PM

Google Pay Flex SBI Credit Card Launch Rewards, Fee Benefits

డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక అడుగు పడింది. గూగుల్ పే, ఎస్‌బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ‘గూగుల్ పే ఫ్లెక్స్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు’ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా ప్రారంభమైన ఈ కో-బ్రాండెడ్ కార్డు ద్వారా క్రెడిట్ కార్డు చెల్లింపులు, యూపీఐ లావాదేవీలు, రివార్డులను ఒకే డిజిటల్ వేదికలో నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది.

కార్డు కోసం దరఖాస్తు చేయడం నుంచి ఖాతా నిర్వహణ, లావాదేవీలను పరిశీలించడం, చెల్లింపులు చేయడం, కొన్ని సందర్భాల్లో బకాయిలను ఈఎంఐగా మార్చుకోవడం వరకు అనేక సేవలను గూగుల్ పే యాప్‌ నుంచే పొందవచ్చు. ఎస్‌బీఐ కార్డు నిబంధనల ప్రకారం, గూగుల్ పే ఫ్లెక్స్ కార్డుదారులకు ‘Pay in EMI’ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఇందులో అర్హత ఉన్న రిటైల్ లావాదేవీలను కనీసం రూ.2,500 నుంచి 3, 6, 9, 12, 18, 24, 36 నెలల కాలవ్యవధులకు ఈఎంఐగా మార్చుకోవచ్చు.

‘స్టార్స్’ రూపంలో రివార్డులు

ఈ కార్డులో ప్రత్యేక ఆకర్షణ ‘స్టార్స్’ రివార్డ్ ప్రోగ్రామ్. ఇందులో ఒక స్టార్ విలువ రూ.1గా ఉంటుంది. అర్హత కలిగిన కొనుగోళ్లపై కస్టమర్లు స్టార్స్‌ను సంపాదించి, గూగుల్ పేలో అందుబాటులో ఉన్న ఎంపిక చేసిన వోచర్లు లేదా చెల్లింపుల సమయంలో వాటిని వినియోగించుకోవచ్చు.

కిరాణా, యుటిలిటీ బిల్లులు, షాపింగ్, ప్రయాణం వంటి రోజువారీ ఖర్చులపై రివార్డులు పొందేలా ఈ కార్డును రూపొందించారు. ఖర్చు స్థాయిని బట్టి రివార్డ్ ప్రయోజనాలు మారేలా నిర్మాణం ఉంటుంది. ప్రాథమిక రివార్డ్ నిర్మాణంలో ఏడాదికి గరిష్ఠంగా 18,000 స్టార్స్ వరకు సంపాదించే అవకాశం ఉంటుంది.

కొత్త కస్టమర్లకు రూ.1,000 వరకు వెల్‌కమ్ బెనిఫిట్ కూడా అందిస్తోంది. మొదటి గూగుల్ పే చెల్లింపు, జాయినింగ్ ఫీజు చెల్లింపు, ప్రారంభ ఖర్చు మైలురాళ్లకు అనుసంధానమైన ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.

రూ.1 లక్ష ఖర్చు చేస్తే ఫీజు మాఫీ

గూగుల్ పే ఫ్లెక్స్ ఎస్‌బీఐ కార్డుకు జాయినింగ్, వార్షిక రెన్యువల్ ఫీజు రూ.499గా ఉంది. దీనికి వర్తించే పన్నులు అదనం. అయితే కార్డుదారుడు ఏడాదిలో రూ.1 లక్ష ఖర్చు చేస్తే ఈ వార్షిక ఫీజును మాఫీ చేస్తారు. ఈ కార్డు వీసా, రూపే నెట్‌వర్క్‌లలో అందుబాటులోకి వచ్చింది. రూపే వేరియంట్‌ను యూపీఐకి లింక్ చేసుకుని, యూపీఐకి అనుకూలమైన వ్యాపారుల వద్ద క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ట్యాప్-టు-పే లావాదేవీల కోసం గూగుల్ పే టోకెనైజేషన్ వంటి డిజిటల్ చెల్లింపు సదుపాయాలకు కూడా మద్దతు ఉంది.

అయితే యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు వినియోగం ప్రధానంగా వ్యాపార చెల్లింపులకే వర్తిస్తుంది. వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు డబ్బు బదిలీ, కొన్ని ప్రత్యేక కేటగిరీల చెల్లింపులకు రూపే క్రెడిట్ కార్డు-ఆన్-యూపీఐ సదుపాయం వర్తించదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement