కార్డులు, లోన్లు వదిలి కార్పొరేట్ బ్యాంకింగ్ వైపు పరుగులు
దేశీ దిగ్గజాలతో పోటీ తట్టుకోలేక వ్యూహం మార్చిన గ్లోబల్ బ్యాంకులు
సిటీ, డాయిష్ ,ఆర్‌బీఎస్ తర్వాత మరో విదేశీ బ్యాంకు వెనక్కి
ఫెడరల్ బ్యాంకు చేతికి స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డు వ్యాపారం
ఒకప్పుడు భారత్‌లో వ్యాపార విస్తరణకు, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంక్ వద్ద తీవ్రంగా లాబీయింగ్ చేసి దేశ బ్యాంకింగ్ రంగంలోకి క్యూ కట్టిన విదేశీ బ్యాంకులు ఇప్పుడు ఒక్కొక్కటిగా భారత రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నాయి. తాజాగా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ భారత్‌లో తన రిటైల్ క్రెడిట్ కార్డు వ్యాపారాన్ని పూర్తిగా ఫెడరల్ బ్యాంకుకు అప్పగించింది. దీంతో 4.5 లక్షల క్రెడిట్ కార్డు అకౌంట్లు ఫెడరల్ బ్యాంక్ ఖాతాలో పడ్డాయి. అయితే విదేశీ బ్యాంకులు భారత్ బ్యాంకింగ్ నుంచి పూర్తిగా వైదొలగడం లేదని, వినియోగదారుల బ్యాంకింగ్‌కు బదులుగా కార్పొరేట్ బ్యాంకింగ్, ట్రేడ్ ఫైనాన్స్, వెల్త్ మేనేజ్‌మెంట్, ఇన్‌స్టిట్యూషనల్ బ్యాంకింగ్ వంటి అధిక లాభదాయక రంగాలపై ఫోకస్ మార్చుకున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దేశీ బ్యాంకులే అసలు సవాల్
విదేశీ బ్యాంకులు వెనక్కు తగ్గడానికి ప్రధాన కారణం దేశీ బ్యాంకుల అపారమైన నెట్‌వర్క్ బలం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి సంస్థలకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో శాఖలు, కోట్లాది కస్టమర్లు, బలమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే భారత్‌లోని అన్ని విదేశీ బ్యాంకుల శాఖలను కలిపినా 800 దాటవు. తక్కువ శాఖలతో వాటికి చౌక డిపాజిట్లు సేకరించడం కష్టమవుతోంది. అదేసమయంలో రిటైల్ రుణాల్లో దేశీ బ్యాంకులు డేటా అనలిటిక్స్, డిజిటల్ యాప్స్, క్రాస్ సెల్లింగ్ ద్వారా భారీ ఆధిక్యం సాధించాయి.
నిబంధనల భారం
రిజర్వ్ బ్యాంక్ ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డులు, డిజిటల్ లెండింగ్, డేటా లోకలైజేషన్, ఔట్ సోర్సింగ్, కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారం, టెక్నాలజీ రిస్క్ మేనేజ్‌మెంట్
వంటి అంశాలపై అనేక నిబంధనలను కఠినతరం చేసింది. దిగ్గజ దేశీ బ్యాంకులు వీటిపై అయ్యే ఖర్చును తమకున్న భారీ కస్టమర్ బేస్‌పై విభజించగలుగుతున్నాయి. కానీ పరిమిత వ్యాపారంలో ఉన్న విదేశీ బ్యాంకులకు ఈ ఖర్చు అధిక భారంగా మారుతోంది.
దీనివల్ల రిటైల్ బ్యాంకింగ్‌లో లాభదాయకత తగ్గుతోంది. రిటైల్ బ్యాంకింగ్ అంటేనే దేశ వ్యాప్తంగా శాఖలు, సిబ్బంది, టెక్నాలజీ, మార్కెటింగ్, కాంప్లెయన్స్ పై భారీ పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. అయితే చేసిన పెట్టుబడిపై రాబడి రావడానికి సంవత్సరాలు పడుతుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ బ్యాంకులు తక్కువ మూలధనంతో ఎక్కువ అదాయం వచ్చే రంగాలవైపు మళ్లుతున్నాయి. కార్పొరేట్ లోన్లు, ట్రేడ్ ఫైనాన్స్, ట్రెజరీ, వెల్త్ మేనేజ్‌మెంట్ వంటి రంగాల్లో వీటికి సహజమైన ఆధిక్యం ఉండడంతో వాటిపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి.
మారుతున్న వ్యూహం
విదేశీ బ్యాంకులు భారత మార్కెట్‌ను వదిలి పెట్టడంలేదు. వేగంగా ఎదుగుతున్న భారత ఆరి్ధకవ్యవస్థలో కార్పొరేట్ ఫైనాన్సింగ్, విదేశీ పెట్టుబడులు, ట్రేడ్ ఫైనాన్స్, ట్రెజరీ సేవలు, వెల్త్ మేనేజ్ మెంట్ రంగాల్లో భారీ అవకాశాలు కనిపిస్తున్నా యి. అంతర్జాతీయ కంపెనీలు, బహుళ జాతి కంపెనీలు, హైనెట్‌వర్త్ వ్యాపారులకు సేవలందించడం ద్వారా మెరుగైన లాభాలు వస్తుండడంతో తమ వ్యాపార నమూనాను ఆదిశగా మార్చుకుంటున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేíÙస్తున్నారు.
– సాక్షి, బిజినెస్ డెస్క్
నిష్క్రమణ బాటలో
గత పదేళ్లలో అనేక విదేశీ బ్యాంకులు ఇదే దారిలో నడిచాయి. సిటీ బ్యాంక్: తన మొత్తం భారత కన్జూమర్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని 2022లో యాక్సిస్ బ్యాంకుకు విక్రయించింది. రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్‌బీఎస్): భారత్‌లో రిటైల్ కార్యకలాపాలను పూర్తిగా మూసివేసింది. డాయిష్ బ్యాంక్: రిటైల్, వెల్త్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని కోటక్ మహీంద్రా బ్యాంకుకు విక్రయించింది. హెచ్‌ఎస్‌బీసీ: ఏఎన్‌జెడ్ వంటి బ్యాంకులు కూడా రిటైల్ కార్యకలాపాలను తగ్గించి కార్పొరేట్ సేవలపైనే దృష్టి పెట్టాయి.
దేశీ బ్యాంకులకు అవకాశం
విదేశీ బ్యాంకులు రిటైల్ రంగం నుంచి వెనక్కి తగ్గడం దేశీ బ్యాంకులకు భారీ అవకాశంగా మారుతోంది. రిటైల్ రుణాలు, క్రెడిట్ కార్డులు, డిపాజిట్లు, వెల్త్ మేనేజ్‌మెంట్ కస్టమర్లను భారీ ఎత్తున సొంతం చేసుకునే అవకాశం భారత బ్యాంకులకు లభిస్తోంది. సాంకేతికత, డిజిటల్ డిజిటల్ బ్యాంకింగ్, విస్తృత శాఖల నెట్‌వర్క్, తక్కువ ఖర్చుతో డిపాజిట్లు సమీకరించే సామర్థ్యం వల్ల దేశీయ బ్యాంకులు ఇప్పటికే మార్కెట్‌పై ఆధిపత్యం సాధించాయి.ఇక ఈ రంగంలో విదేశీ బ్యాంకుల నిష్క్రమణతో ఆ ఆధిపత్యం మరింత పెరిగే అవ కాశాలున్నాయి.


