క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఊరటనిస్తూనే, బ్యాంకుల పనితీరులో పారదర్శకత పెంచేలా ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. క్రెడిట్ కార్డ్ చెల్లింపులు, జరిమానాలు, రిపోర్టింగ్ విషయంలో ఆర్‌బీఐ ‘క్రెడిట్, డెబిట్ కార్డ్ జారీ-ప్రవర్తన ఆదేశాలు, 2026’లో కీలక మార్పులు చేసింది. ప్రధానంగా ఆలస్యపు చెల్లింపుల (Late Payments) విషయంలో కస్టమర్లపై పడే భారాన్ని తగ్గించడం ఈ సవరణల ముఖ్య ఉద్దేశం.
ప్రధాన మార్పులు ఇవే..
నిర్ణీత గడువు తేదీ (Due Date) ముగిసిన వెంటనే ఖాతాను ‘ఓవర్ డ్యూ’గా పరిగణించకూడదు. గడువు ముగిసిన తర్వాత మూడు రోజుల వరకు విండో కాలాన్ని అందించాలి. ఈ మూడు రోజుల్లోపు చెల్లింపు చేస్తే, దానిని ‘గత బకాయి’ (Past Due)గా పరిగణించరు, క్రెడిట్ స్కోర్‌పైనా ప్రభావం పడదు.
గతంలో బ్యాంకులు మొత్తం బిల్లుపై జరిమానాలు విధించేవి. కానీ కొత్త నిబంధనల ప్రకారం, గడువు తర్వాత చెల్లించాల్సిన నికర బకాయి మొత్తంపై మాత్రమే జరిమానా విధించాలి.
జరిమానా విధించడానికి మూడు రోజుల గ్రేస్ పీరియడ్ ఉన్నప్పటికీ, 'ఆలస్యమైన రోజుల' లెక్కింపు మాత్రం అసలు గడువు తేదీ నుంచే ప్రారంభమవుతుంది.
కార్డుదారులకు కాస్త రిలీఫ్
వినియోగదారులకు ఇది ఒక రకమైన 'సేఫ్టీ నెట్' లాంటిది. పొరపాటున ఒక రోజు ఆలస్యమైనా భారీ జరిమానాలు, క్రెడిట్ రేటింగ్ (Credit Score) పడిపోవడం వంటి సమస్యలు ఉండవు. అయితే, దీనిని అలవాటుగా మార్చుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే వడ్డీ రేట్లు, బిల్లింగ్ సైకిల్స్‌లో ఎటువంటి మార్పు ఉండదు. గడువు దాటిన తర్వాత చేసే ప్రతి ఆలస్యం బ్యాంకుల అంతర్గత రికార్డుల్లో నమోదవుతూనే ఉంటుంది.
ఆర్బీఐ లక్ష్యం ఇదే..
వివిధ బ్యాంకులు, కార్డు జారీ సంస్థలు తమకు నచ్చినట్లుగా జరిమానాలు విధించడం, క్రెడిట్ బ్యూరోలకు నివేదించడం వంటి పద్ధతులకు స్వస్తి పలకాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ఆస్తి వర్గీకరణ, ఆదాయ గుర్తింపు నియమాలను అన్ని బ్యాంకులకు ఒకేలా వర్తింపజేయడం ఈ మార్పు వెనుక ఉన్న అసలు లక్ష్యం.
అమలు ఎప్పటి నుంచి?
ఈ సవరించిన నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుండి అమల్లోకి వస్తాయి. బ్యాంకులు తమ సాఫ్ట్‌వేర్ వ్యవస్థలను మార్చుకోవడానికి, వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఆర్‌బీఐ ఈ గడువును ఇచ్చింది.
ఇదీ చదవండి: వచ్చేది పెను సంక్షోభమే: కియోసాకి అలర్ట్


