ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో (2026-27, క్యూ1) రూ. 4,856 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ. 4,752 కోట్లతో పోలిస్తే లాభం 2 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం రూ. 38,063 కోట్ల నుంచి రూ. 39,684 కోట్లకు చేరింది. 4.2 శాతం వృద్ధి నమోదైంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 13 శాతం పెరిగి రూ. 10,215 కోట్లకు ఎగసింది. గతేడాది క్యూ1లో ఇది రూ. 9,009 కోట్లు మాత్రమే.
ఎఫ్‌సీఎన్‌ఆర్ డిపాజిట్లు ఎట్ 1.3 బిలియన్ డాలర్లు
ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ డిపాజిట్ల (ఎఫ్‌సీఎన్‌ఆర్-బీ) రూపంలో బ్యాంకు ఇప్పటిదాకా 775 మిలియన్ డాలర్లను సమీకరించింది. మొత్తంమీద ఈ మార్గంలో 1.3 బిలియన్ డాలర్ల డిపాజిట్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ బ్రజేష్ కుమార్ సింగ్‌సింగ్ తెలిపారు. కాగా, విదేశీ రుణాల ద్వారా 1 బిలియన్ డాలర్లను సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించారు.
దిగొచ్చిన ఎన్‌పీఏలు: క్యూ1లో బ్యాంక్ స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) 1.57 శాతానికి దిగొచ్చాయి. గతేడాది ఇదే క్వార్టర్లో ఇవి 2.69 శాతంగా ఉన్నాయి. అదేవిధంగా నికర ఎన్‌పీఏలు కూడా 0.63 శాతం నుంచి 0.36 శాతానికి తగ్గాయి.


