క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొనడం మంచిదేనా? | Can You Use A Credit Card To Buy Gold Know The Facts Here | Sakshi
Sakshi News home page

క్రెడిట్ కార్డుతో గోల్డ్ కొనడం మంచిదేనా?

Jul 19 2026 9:20 PM | Updated on Jul 19 2026 9:28 PM

Can You Use A Credit Card To Buy Gold Know The Facts Here

భారతదేశంలో బంగారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందనే విషయం అందరికీ తెలుసు. పండుగలకు, పబ్బాలకు, పెళ్లిళ్లు, పేరంటాలకు లేదా పెట్టుబడి కోసం చాలా మంది ఎప్పటికప్పుడు గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉంటారు. అయితే ప్రస్తుతం.. బంగారం ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు క్రెడిట్ కార్డు ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇది అప్పటికి సౌకర్యవంతంగా అనిపించినా, కొన్ని ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని, లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణుల హెచ్చరిక
క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనేవారు.. ముందుగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. క్రెడిట్ కార్డు అనేది మీ సొంత డబ్బు కాదు. అది బ్యాంకు ఇచ్చే రుణం. కాబట్టి.. బంగారం కొనుగోలు చేసిన తర్వాత క్రెడిట్ కార్డు బిల్లు గడువులోగా పూర్తిగా చెల్లించకపోతే భారీ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కొన్ని బ్యాంకులు ఏడాదికి 36 నుంచి 42 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తాయి. దీనికి ఆలస్య రుసుములు, జీఎస్‌టీ వంటి అదనపు ఛార్జీలు కూడా జతవుతాయి. కాబట్టి.. కేవలం రివార్డ్ పాయింట్లు వస్తాయని క్రెడిట్ కార్డుతో బంగారం కొనడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలా చేస్తే కొంత ప్రయోజనం
అయితే.. ఇక్కడ గుర్తుచుకోవాల్సిన విషయం ఏమిటంటే, బిల్లు సమయానికి పూర్తిగా చెల్లించేవారికి క్రెడిట్ కార్డు ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు జీరో కాస్ట్ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్, రివార్డ్ పాయింట్లు వంటి ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో కొంత మేర అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

నిబంధనలు
క్రెడిట్ కార్డుతో బంగారం కొనుగోలుపై కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. 2013లో రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం.. క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసిన బంగారు నాణేలను, ఈఎంఐగా మార్చడానికి బ్యాంకులకు అనుమతి లేదు. అలాగే బ్యాంకు శాఖల్లో క్రెడిట్ కార్డుతో బంగారు నాణేలు విక్రయించకూడదని కూడా సూచించింది.

అయితే.. బంగారు ఆభరణాల కొనుగోలుపై ప్రతి బ్యాంకు వేర్వేరు నిబంధనలు అమలు చేసే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు మీ బ్యాంకు పాలసీని తప్పకుండా తెలుసుకోవాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు.

అధిక ఛార్జీలు
ఇంకో విషయం స్వైప్ ఛార్జీలు. చాలా జ్యువెలరీ దుకాణాలు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేస్తే.. 2 నుంచి 3.5 శాతం వరకు అదనపు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేసే అవకాశం ఉంది. బంగారం విలువ ఎక్కువగా ఉండటంతో ఈ ఛార్జీలు కూడా పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంది.

మరోవైపు.. కొన్ని క్రెడిట్ కార్డులు ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్లలో బంగారం కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు అందిస్తాయి. అయితే, ఈ ఆఫర్లకు కొన్ని షరతులు, పరిమితులు ఉంటాయి. కాబట్టి ఆఫర్ వివరాలను ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement