సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత క్రెడిట్ కార్డు బకాయిని ఆలస్యంగా చెల్లించారనే కారణంగా ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం చట్టబద్ధం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగి, బ్యాంకు మధ్య క్రెడిట్ కార్డు లావాదేవీ అనేది యజమాని–ఉద్యోగి సంబంధం కాదని, అది పూర్తిగా రుణదాత–రుణగ్రహీత మధ్య జరిగే వాణిజ్య ఒప్పందం మాత్రమేనని పేర్కొంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అప్పటి ఆంధ్రాబ్యాంకు) ఉద్యోగి ప్రకాశ్‌బాబుపై విధించిన కంపల్సరీ రిటైర్మెంట్ శిక్షను రద్దు చేసింది.
ఆయన పిటిషన్‌ను అనుమతిస్తూ.. సాధారణ పదవీ విరమణ వరకు సేవలో కొనసాగినట్లుగా పరిగణించాలని ఆదేశించింది. అన్ని సర్వీస్, పింఛన్, రిటైర్మెంట్ ప్రయోజనాలను 8 వారాల్లో చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది. 1979లో ఆంధ్రా బ్యాంకులో ప్రొబేషనరీ అధికారిగా చేరిన ప్రకాశ్ బాబు మూడు దశాబ్దాల పాటు సేవలందించారు. ఉద్యోగంలో ఉండగా బ్యాంకు జారీ చేసిన క్రెడిట్ కార్డును వినియోగించారు. రూ.లక్ష పరిమితి ఉన్న కార్డులో బకాయి పెరిగి రూ.1.68 లక్షలకు చేరింది.
చార్జిషిట్ జారీ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించిన బ్యాంక్.. 2009లో ఆయనపై కంపల్సరీ రిటైర్మెంట్ విధించింది. దీన్ని సవాల్ చేస్తూ 2012లో ప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. క్రెడిట్ కార్డు ఉద్యోగ ప్రయోజనంగా ఇవ్వలేదని, సాధారణంగా మాత్రమే జారీ చేసిందన్నారు. బ్యాంకుకు శాశ్వత ఆర్థిక నష్టం కలిగించాలనే దురుద్దేశం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. వ్యక్తిగత క్రెడిట్ కార్డు బకాయిలపై శాఖాపరమైన విచారణ ప్రారంభించడానికి బ్యాంకుకు చట్టపరమైన అధికారం లేదని తేల్చారు.


