‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026’కు ఆమోదం | End of a 135 Year British Law Lok Sabha Passes Bankers Books Evidence Bill 2026 | Sakshi
Sakshi News home page

‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు-2026’కు ఆమోదం

Aug 6 2026 2:57 PM | Updated on Aug 6 2026 3:01 PM

End of a 135 Year British Law Lok Sabha Passes Bankers Books Evidence Bill 2026

దేశీయ ఆర్థిక, బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. 135 ఏళ్ల నాటి ప్రాచీన చట్టం ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ యాక్ట్ - 1891’ స్థానంలో నూతన సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా రూపొందించిన ‘బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు - 2026’ను లోక్‌సభ ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లు డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ లావాదేవీలు, న్యాయపరమైన సాక్ష్యాల నిరూపణ ప్రక్రియను ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది.

డిజిటల్ యుగానికి అనుగుణంగా నూతన చట్టం

1891 నాటి పాత చట్టం కేవలం భౌతిక కాగితపు లెడ్జర్లు, క్యాష్ బుక్కులు, చేతిరాత ఖాతాలకే పరిమితమైంది. అయితే, నేడు యూపీఐ, నెట్ బ్యాంకింగ్, డిజిటల్ రికార్డులు, క్లౌడ్ స్టోరేజ్ ఆధారిత లావాదేవీలే బ్యాంకింగ్ వ్యవస్థకు మూలాధారంగా మారాయి. ఈ నేపథ్యంలో నూతన చట్టం కొన్ని కీలక మార్పులను తీసుకొచ్చింది.

  • ఎలక్ట్రానిక్, డిజిటల్, వర్చువల్, క్లౌడ్ స్టోరేజ్, డిజాస్టర్ రికవరీ సర్వర్లలో భద్రపరిచిన రికార్డులన్నింటినీ కోర్టుల్లో ప్రాథమిక సాక్ష్యాలుగా పరిగణిస్తారు.

  • సాంప్రదాయ మాన్యువల్ సంతకాలతో పాటు ‘సమాచార సాంకేతిక చట్టం-2000’ కింద ధ్రువీకరించిన డిజిటల్, ఎలక్ట్రానిక్ సంతకాలకు పూర్తి చట్టబద్ధత కల్పించారు.

బ్యాంకింగ్ సిబ్బందికి ఉపశమనం

పాత నిబంధనల ప్రకారం, బ్యాంకులు నేరుగా భాగస్వాములు కాని కేసుల్లో కూడా బ్యాంక్ అధికారులు భౌతిక రికార్డులతో కోర్టులకు హాజరుకావాల్సి వచ్చేది. నూతన బిల్లులోని స్పెషల్ కాజ్ (ప్రత్యేక కారణం) నిబంధన ద్వారా కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తే తప్ప బ్యాంక్ అధికారులను అనవసరంగా సమన్లు చేసే భారం తప్పుతుంది. దీనివల్ల బ్యాంకింగ్ సిబ్బందిపై ఒత్తిడి తగ్గడమే కాక సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, చెక్ బౌన్స్ కేసులు, రుణ రికవరీ వివాదాల్లో సర్టిఫైడ్ డిజిటల్ సాక్ష్యాలు త్వరితగతిన లభించి న్యాయ విచారణ వేగవంతమవుతుంది.

ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement