ఈ వారం ఫారం 4 గురించి తెలుసుకుందాం. ‘లెక్కలు’ అనగానే వ్యాపారం/వృత్తులకు వర్తిస్తాయి. జీతాలు, ఇంటద్దె, క్యాపిటల్ గెయిన్స్, ఇతర ఆదాయాలు.. వీటిలో దేనికి దానికే ప్రత్యేకంగా, చట్టపరంగా బుక్స్ రాయాలి. ఆదాయం పన్ను చట్టంలో ‘అకౌంటు బుక్స్’.. అంటే, ఏమిటో నిర్వచనం ఇచ్చారు. దీని ప్రకారం బుక్స్‌ని నిర్వహించండి. కొంత టర్నోవరు, వసూళ్లు దాటితే ఆడిట్ చేయాలి. కానీ, ఒక మినహాయింపు ఇచ్చారు. మీరు అకౌంట్ బుక్స్ రాయనవసరం లేదు. ఆడిట్ వైపే వెళ్లక్కర్లేదు.
ఫారం ఐటీఆర్ – 4 అంటే ఏమిటి..
🔷 వ్యక్తులు/హిందూ ఉమ్మడి కుటుంబం, భాగస్వామ్య సంస్థలు
🔷 రెసిడెంట్లు అయి ఉండాలి
🔷 సంవత్సరంలో ఆదాయం రూ. 50,00,000 దాటకూడదు
🔷 పాత చట్టం ప్రకారం 44 ఏడీ, 44ఏడీఏ, 44 ఏఈల వ్యాపారం ఉండాలి.
🔷 వ్యాపారం/వృత్తి ఆదాయంతో పాటు జీతం, పెన్షన్, ఒక ఇంటి మీద ఆదాయం, వ్యవసాయం ఆదాయం రూ. 5,000 లోపల, నిర్దేశించిన ఇతర ఆదాయాలు
🔷 నాన్–రెసిడెంట్లు, రూ. 50,00,000 ఆదాయం దాటినవారు, స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్స్ వారు, లాంగ్‌టర్మ్‌లో రూ. 1,25,000 దాటిన వారు, కంపెనీ డైరెక్టర్లు, రెండు ఇళ్ల మీద ఆదాయం ఉన్నవారు, లాటరీ ఆదాయం ఉన్నవారు.. వీళ్లంతా ఈ ఫారం వేయకూడదు.
44ఏడీఏ అంటే ఎవరు..
వృత్తి నిపుణులు – లీగల్, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్ట్, అకౌంటింగ్, టెక్నికల్ కన్సల్టెన్సీ, ఇంటీరియర్ డెకరేషన్.. వీరందరూ, వారి టర్నోవరు/వసూళ్లు.. సంవత్సరానికి రూ. 50,00,000 దాటకపోతే.. వ్యవహారాల్లో 5 శాతం లోపల నగదు లావాదేవీలు జరిపితే రూ. 75,00,000 దాటకపోతే, వీరు 50 శాతం ఆదాయంగా చూపించాలి.
44 ఏడీ అంటే ఎవరు..
పై సెక్షన్ వృత్తి నిపుణులకు వర్తిస్తే, ఈ సెక్షన్ వ్యాపారస్తులకు, టర్నోవరు/వసూళ్లు రూ. 2 కోట్లు దాటకూడదు. 5 శాతం నగదు వ్యవహారాలు దాటకుండా ఉంటే రూ. 3 కోట్లు. వీరు ఈ టర్నోవరుపైన 6 శాతం చొప్పున లాభం ప్రకటించాలి. 6 శాతం దాటి చూపినా ఫర్వాలేదు. కానీ 6 శాతం కన్నా తక్కువ చూపిస్తే బుక్స్ రాసి ఆడిట్ చేయించాలి. ఇదంతా బ్యాంకింగ్ చానల్. నగదు వ్యవహారాలైతే 8 శాతం చొప్పున చూపించాలి.
44ఏఈ ఎవరంటే..
ఇది కేవలం ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారస్తులకే వర్తిస్తుంది. సొంతంగా గానీ.. అద్దెకు గానీ, లీజుగా గానీ కేవలం 10 వాహనాలు లేదా తక్కువ ఉండాలి. ప్యాసింజరు బళ్లకు వర్తించదు. హెవీ వెహికల్ అయితే, ఒక టన్నుకి రూ. 1,000. ఇతర వెహికల్ అయితే ఒక బండికి రూ. 7,500.
పైన చెప్పిన మూడు రకాలవారికి
🔷 బుక్స్ అవసరం లేదు
🔷 ఆడిట్ అవసరం లేదు
🔷 వ్యాపార ఖర్చులు మినహాయింపు
🔷 పాత పద్ధతిలో అయితే 80సీ మొదలైన తగ్గింపులుంటాయి
అయితే ముఖ్యమైన విషయం
🔷 ఇతర రికార్డులు, వ్యాపారానికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్లు మొదలైనవన్నీ ఉండాలి.
🔷 జీఎస్‌టీ రికార్డులు ఉండాలి
🔷 బ్యాంకు అకౌంటు బుక్స్ ఉండాలి
🔷 బిల్లులు, ఇన్వాయిస్‌లు, వసూళ్లకు సంబంధించి రికార్డులు ఉండాలి
🔷 లాగ్ బుక్స్ ఉండాలి
కొన్ని పరిమితులు/ఆంక్షలు ఉన్నాయి. అవి దాటలేదని నిర్ధారించడానికి అవసరమైన రికార్డులుంటే లెక్కలు లేకుండానే, సక్రమంగా రిటర్నులు వేయొచ్చు.


