ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు నిర్దేశించిన జులై 31 తుది గడువు రేపటితో ముగుస్తుండటంతో పన్ను చెల్లింపుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో డెడ్‌లైన్ పొడిగింపుపై రకరకాల ప్రచారాలు, ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కానీ గడువు పెంపుపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు పుకార్లను నమ్మకుండా అందుబాటులో ఉన్న సమయాన్నే ప్రామాణికంగా తీసుకుని వెంటనే ఐటీఆర్ దాఖలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆర్థిక, పన్ను నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పుకార్లపై అప్రమత్తత
ఏటా ఐటీఆర్ డెడ్‌లైన్ సమీపించే సమయంలో గడువు పొడిగిస్తారనే ప్రచారం సహజంగా మారినప్పటికీ అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం అటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని పన్ను నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫారమ్‌ల లభ్యత, సాంకేతిక సమస్యల కారణంగా దాఖలు వేగం మందగించిన మాట నిజమే అయినా ప్రస్తుతం ఐటీ శాఖ తన ఈ-ఫైలింగ్ పోర్టల్ మౌలిక వసతులను గణనీయంగా బలోపేతం చేసింది. ఒకేసారి లక్షలాది మంది వినియోగదారులు లాగిన్ అయినా తట్టుకునేలా వ్యవస్థను సన్నద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఆలస్యమైతే జరిమానా
జులై 31 తుది గడువును దాటవేస్తే పన్ను చెల్లింపుదారులు ఆర్థికంగానూ, సాంకేతికంగానూ నష్టపోవాల్సి వస్తుంది. లేట్ ఫీజు (జరిమానా) కింద పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయ స్థాయిని బట్టి గరిష్టంగా రూ.5,000 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. బకాయి ఉన్న పన్ను మొత్తంపై నిర్దేశిత చట్టాల ప్రకారం వడ్డీ వర్తిస్తుంది. సకాలంలో రిటర్నులు సమర్పించకపోతే రావాల్సిన రీఫండ్ జమకావడంలో ఆలస్యం జరుగుతుంది. ఆఖరి నిమిషంలో హడావుడిగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల ఆన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ఫారం-26ఏఎస్ వివరాల సరిపోలికలో పొరపాట్లు జరిగి ఐటీ నోటీసులకు దారితీసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు


