వచ్చే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఆధార్ కార్డుదారులు, క్రెడిట్ కార్డు వినియోగదారులు, పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు, బ్యాంకు ఖాతాదారులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్‌కు ఉచిత అవకాశం, క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ నిబంధనల్లో మార్పులు, పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు, బ్యాంకుల మిస్-సెల్లింగ్‌పై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి.
ఐటీఆర్ దాఖలుకు జూలై 31 చివరి తేదీ
2025-26 ఆర్థిక సంవత్సరానికి (అసెస్‌మెంట్ ఇయర్ 2026-27) సంబంధించిన ఐటీఆర్-1, ఐటీఆర్-2 రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31, 2026 చివరి గడువు. గడువు దాటితే ఆలస్య రుసుములు, కొన్ని పన్ను విధానాలను ఎంచుకునే అవకాశాలపై పరిమితులు, అర్హత ఉన్న నష్టాలను తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వర్డ్ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఆధార్‌లో ఈమెయిల్ అప్‌డేట్
యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆధార్ మొబైల్ యాప్ ద్వారా నమోదిత ఈమెయిల్ చిరునామాను అప్‌డేట్ చేసుకునే సేవను పూర్తిగా ఉచితంగా అందించనుంది. దీని కోసం ఇప్పటి వరకు రూ.75 రుసుము ఉండేది. అయితే ఈ రాయితీ కేవలం అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్‌డేట్‌లకే వర్తిస్తుంది.
ఎస్‌బీఐ కార్డుల రివార్డ్ నిబంధనల్లో మార్పులు
ఫోన్‌పే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు PURPLE, SELECT BLACK కార్డులకు సంబంధించిన రివార్డ్ పాయింట్ల విధానంలో మార్పులు అమల్లోకి రానున్నాయి. రివార్డ్ పాయింట్లు పొందే లావాదేవీలపై కొత్త పరిమితులు విధించడంతో పాటు, పాయింట్లు లభించని లావాదేవీల జాబితాను కూడా విస్తరించారు.
హెచ్‌డీఎఫ్‌సీ లాంజ్ యాక్సెస్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులు ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో మూడు ఉచిత దేశీయ విమానాశ్రయ లాంజ్ సందర్శనలను పొందాలంటే, అంతకుముందు త్రైమాసికంలో కనీసం రూ.60,000 ఖర్చు చేసి ఉండాలి. ఉదాహరణకు జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి లాంజ్ సదుపాయం పొందాలంటే ఏప్రిల్-జూన్ మధ్య ఈ ఖర్చు పూర్తిచేయాల్సి ఉంటుంది.
పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు
జూలై 1 నుంచి సాధారణ, తత్కాల్ పాస్‌పోర్ట్‌ల ఫీజులు పెరుగుతున్నాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,500 నుంచి రూ.2,500కు, తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది. ఇతర కేటగిరీల ఫీజులను కూడా కేంద్ర ప్రభుత్వం సవరించింది.
బ్యాంకుల మిస్-సెల్లింగ్‌పై ఆర్‌బీఐ కఠిన చర్యలు
బ్యాంకులు ఆర్థిక ఉత్పత్తులను తప్పుదోవ పట్టిస్తూ విక్రయించే ఘటనలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను అమల్లోకి తెస్తోంది. ఈ నిబంధనల ప్రకారం మిస్-సెల్లింగ్‌కు గురైన వినియోగదారులు పూర్తి రీఫండ్‌తో పాటు జరిగిన నష్టానికి తగిన పరిహారం పొందే హక్కు కలిగి ఉంటారు. బ్యాంకులు ఉత్పత్తుల విక్రయంలో మరింత పారదర్శకత పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు కూడా జూలై 1 నుంచే అమల్లోకి వస్తాయి.


