శత్రువులను ఏమార్చడానికే విమాన మార్పిడి | Donald Trump says his plane faced greater risk in secret flight change | Sakshi
Sakshi News home page

శత్రువులను ఏమార్చడానికే విమాన మార్పిడి

Aug 13 2026 4:51 AM | Updated on Aug 13 2026 4:51 AM

Donald Trump says his plane faced greater risk in secret flight change

ధ్రువీకరించిన అమెరికా అధ్యక్షుడు  

బెదిరింపులు సర్వ సాధారణమన్న ట్రంప్‌ 

ప్రాముఖ్యత ఉన్నవారికే బెదిరింపులొస్తాయని వ్యాఖ్య

వాషింగ్టన్‌: నాటో శిఖరాగ్ర సమావేశం అనంతరం టర్కీ నుంచి నిష్క్రమించే సమయంలో విమానం మార్పును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధృవీకరించారు. బెదిరింపుల నేపథ్యంలో శత్రువులను ఏమార్చడానికే మరో విమానంలో సీక్రెట్‌గా ప్రయాణించినట్లు అంగీకరించారు. అయితే బెదిరింపుల వివరాలేవీ వెల్లడించని ఆయన.. సీక్రెట్‌ సర్వీస్, అమెరికా సైన్యం నుంచి వచ్చిన సూచనలను తాను పాటించానని చెప్పారు. ‘నేను సీక్రెట్‌ సర్వీస్, సైన్యం ఆదేశాల మేరకు వెళ్తాను. వారు నన్ను వేరే విమానంలో, మరో ఫ్లైట్‌లో వెళ్లమన్నారు. వారు చెప్పినట్లే చేశాను. 

బహుశా బయట ఏదో ముప్పు పొంచి ఉందనుకున్నాను. దాని గురించి పెద్దగా అడగలేదు. నాకు చాలా బెదిరింపులు వస్తుంటాయి’అని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడికి బెదిరింపులు రావడం సాధారణమేనన్న ట్రంప్‌.. ‘ప్రాముఖ్యత ఉన్న ఏ అధ్యక్షుడికైనా చాలా బెదిరింపులు ఉంటాయని, ప్రాముఖ్యత లేని అధ్యక్షులకు బెదిరింపులుండవు. అత్యంత ప్రాముఖ్యత ఉన్న అధ్యక్షుడిని నేనే అనుకుంటున్నా. అయితే ప్రమాదాల గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. నేను దేని గురించీ చింతించను. ఏదేమైనా సరే, నా వైఖరి మీకు తెలుసు కదా?’అని వ్యాఖ్యానించారు.  

ట్రంప్‌ టర్కీ నుంచి బయలుదేరేటప్పుడు ఏమి జరిగింది 
జులైలో అంకారాలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు హాజరైనప్పుడు ఇరాన్‌ నుంచి హత్య బెదిరింపు రావడంతో ట్రంప్‌ రహస్యంగా విమానం మార్చారని వాషింగ్టన్‌ పోస్ట్‌ నివేదించింది. ఖతార్‌ విరాళంగా ఇచ్చిన బోయింగ్‌ 747–8 విమానంలో ట్రంప్‌ టర్కీకి చేరుకున్నారు. అయితే, ట్రంప్‌ను లేదా ఆయన విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ నుంచి ముప్పు పొంచి ఉందని అమెరికా అధికారులకు నిఘా సమాచారం అందింది. 

వచ్చిన విమానంలోనే ట్రంప్‌ తిరిగి ప్రయాణించకూడదని సీక్రెట్‌ సర్వీస్‌ నిర్ణయించింది. అందుకు, ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం ఎక్కిన ట్రంప్‌ను ఆ విమానం నుంచి ఒక చిన్న ఎయిర్‌ ఫోర్స్‌ సి–32ఏ సైనిక జెట్‌లోకి మార్చారు. 

విమాన మార్పు విషయం బయటపడకుండా ఆయనను ఒక విమానాశ్రయ క్యాటరింగ్‌ వాహనంలో తీసుకెళ్లారు. వెంట ఉన్న జర్నలిస్టులు, వైట్‌ హౌస్‌ సిబ్బంది ఆ విమానంలోనే ట్రంప్‌ తమతోనే ప్రయాణిస్తున్నారని నమ్మారు. అయితే, ఈ ముప్పు గురించి తెలియకుండా, పాత్రికేయులను, కొంతమంది సిబ్బందిని ఆ విమానంలోనే ఉంచాలన్న నిర్ణయంపై కూడా ప్రశ్నలు లేవనెత్తాయి. ఈ చర్య అధ్యక్షుడిని రక్షించడానికి ఉద్దేశించినప్పటికీ, దీని వెనుక ఉన్న భద్రతాపరమైన ఆందోళన గురించి తెలియజేయకుండా విమానంలోని వారిని ప్రమాదకరమైన స్థితిలో ఉంచిందని విమర్శలొచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement