పాత ఒప్పందానికి పాతర | Sakshi Editorial On Turkey, Saudi Arabia, Pakistan, defense agreement | Sakshi
Sakshi News home page

పాత ఒప్పందానికి పాతర

Aug 13 2026 12:59 AM | Updated on Aug 13 2026 12:59 AM

Sakshi Editorial On Turkey, Saudi Arabia, Pakistan, defense agreement

అనిశ్చిత ప్రపంచంలో మరో కొత్త రక్షణ ఒప్పందం ఉనికిలోకొచ్చింది. తుర్కియే, సౌదీ అరేబియా, పాకిస్తాన్‌లు గత శుక్రవారం ‘మక్కా రక్షణ ఒప్పందం’ పేరిట ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాయి. పూర్తి పాఠాన్ని బయటపెట్టలేదు గనుక దీని లోతుపాతులు తెలియవు. కానీ పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ ‘ఈ మూడు దేశాల్లో ఏ ఒక్కరిపై దాడి జరిగినా అది అందరిపైనా జరిగిన దాడిగా పరిగణించాల’ని నిర్ణయించుకున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. తుర్కియే అధ్యక్షుడు రిసెప్‌ తయీప్‌ ఎర్డోగాన్‌ మాత్రం ‘ఈ ఒప్పందం కింద ఉమ్మడిగా రక్షణ పరిశ్రమ ప్రాజెక్టులు చేపట్టడం, ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో పాలుపంచుకోవటం ఉంటాయ’ని ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. ఒప్పందం విషయంలో అమెరికాకు ఆగ్రహం కలుగుతుందని సౌదీ భావించినట్టుంది. అందుకే ‘ఈ మూడు దేశా లకూ ఇప్పటికే ఉన్న ఇతర రక్షణ ఒప్పందాలు దీనికి అడ్డురాబోవ’ని సౌదీ ఉపమంత్రి రేయాద్‌ క్రిమ్లీ వివరణనిచ్చారు. ఒప్పందంపై కొద్ది నెలలుగా సాగిన చర్చల్లో పాల్గొన్న ఈజిప్టు చివరన ముఖం చాటేసింది. ఇంతకూ ఇస్లామిక్‌ దేశాల సహకార సంస్థ (ఓఐసీ) సదస్సులో గతంలో కుదిరిన ‘మక్కా ఒప్పందం’ ఏమైంది?

ఈ మూడు దేశాలకూ ఇరుగుపొరుగుతో వాటి వాటి సొంత ఘర్షణలున్నాయి. తమలో తమకున్న పొరపొచ్చాలు వీటికి అదనం. నాటోలో భాగస్వామిగా ఉన్న తుర్కియేకు ఎజియన్‌ సముద్రంలో మరో సభ్య దేశం గ్రీస్‌తో సరిహద్దు లడాయి వుంది. ఇజ్రాయెల్‌తో వైరం సరేసరి. పాకిస్తాన్‌ అయితే ఇటు మన దేశంతోపాటు అఫ్గానిస్తాన్‌తో కూడా కలహిస్తోంది. ఇరాన్‌పై అమెరికా దాడుల్ని సమర్థించటమేకాక... దాని అభీష్టం మేరకు ఇజ్రాయెల్‌తో అవగాహన కుదుర్చుకున్న చరిత్ర సౌదీది. పర్యవసానంగా ఇరాన్‌ నుంచీ, ఎర్ర సముద్రంలో ఇరాన్‌ మద్దతుదార్లయిన హౌతీలనుంచీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఇక 2018లో తుర్కియే గడ్డపై జర్నలిస్టు ఖషోగ్గిని కిరాయి హంతకులతో సౌదీ ప్రిన్స్‌ మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ హత్య చేయించారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంలో రెండు దేశాల సంబంధాలూ దెబ్బతిన్నాయి. అమెరికా ప్రాపకంతో తెరవెనక సర్దుబాట్లు కుదిరినా తుర్కియే ఆగ్రహం చల్లారలేదు.

ఇలా ఎవరికి వారు సక్రమంగా లేకుండా, ఎవరిపై దాడి జరిగినా అందరం ఏకమవు తామనటంలోని సహేతుకత ఏమిటో అర్థంకాదు. దేశంలో అమెరికా స్థావరాలుంటే భద్రతకు తిరుగులేదని ఇతర గల్ఫ్‌ దేశాలతోపాటు సౌదీ కూడా అమాయకంగా అనుకున్నది. అమెరికా వేరేవారిపై దాడి చేస్తే దాని అధునాతన రక్షణ వ్యవస్థవల్ల ఒక్క క్షిపణి కూడా తమ గడ్డపై పడబోదని నమ్మింది. అదంతా ఉత్త భ్రమగా తేలింది. ఇరాన్‌ వల్లకాడు కావటానికి తోడ్పడుతూ తమ జోలికి మాత్రం అది రాకూడదని కోరుకోవటం అత్యాశ అని అర్థమైంది. అందుకే రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుని అందరినీ హడలెత్తించాలని ఆ దేశం నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. నిరుడు పాక్‌తో కుదిరిన రక్షణ ఒప్పందం తాజా యుద్ధంలో కొరగాకుండా పోయింది. ఇరాన్‌తో అంటకాగిన పాక్‌... కనీసం సౌదీపై అది చేసిన దాడుల్ని ఖండించటానికి కూడా సిద్ధపడలేదు. తీరు మారకపోతే ఈ త్రైపాక్షిక ఒప్పందానికీ అదే గతి పడుతుంది. 

ఇస్లామిక్‌ దేశాలు 2005లో ‘మక్కా ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. ఆ సంగతి ముగ్గురిలో ఎవరికైనా గుర్తుందా? పదేళ్లపాటు కొనసాగాల్సిన ఆ ఒప్పందాన్ని మరో పదేళ్లు పొడిగించారు కూడా. దాని అతీగతీ తెలియదు. 21వ శతాబ్దంలో ఇస్లాంకు ఎదురవుతున్న సవాళ్లపై జరిపిన సదస్సులో ఈ ఒప్పందం కుదిరింది. ఇస్లామిక్‌ ప్రపంచంలో సంయమనం, సౌభ్రాతృత్వం, మానవ హక్కులు, సుపరిపాలన, ఆర్థిక సహకారం, ఘర్షణల నివారణ, పేదరిక నిర్మూలన, ఉన్నత విద్య, శాస్త్ర సాంకేతికతలు, మహిళల హక్కులు దాని ప్రధానాంశాలు. ఇందులో పాలస్తీనా కూడా ఉంది. వినడానికి భేషుగ్గా ఉంది. కానీ ఆచరణ? తాజా ఒప్పందంతో వాటన్నిటినీ పర్షియన్‌ గల్ఫ్‌లో నిండా ముంచినట్టేనా? ఇతరుల్ని ఇబ్బందుల్లోకి నెడుతూ, వారినుంచి తమకేమీ కాకూడదని ఆశించటం వ్యర్థ ప్రయత్నమని ఈ దేశాలు గుర్తించాలి. ఇందుకు బదులు 2005 నాటి ఒప్పందం అమలుకు చిత్తశుద్ధితో కృషిచేయాలి. అప్పుడు మాత్రమే వాటికి కోరుకున్న శాంతి లభిస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement