అడాప్ట్‌ ఎ రైటర్‌ | Sakshi Editorial On Adopt a Writer | Sakshi
Sakshi News home page

అడాప్ట్‌ ఎ రైటర్‌

Aug 10 2026 12:49 AM | Updated on Aug 10 2026 12:49 AM

Sakshi Editorial On Adopt a Writer

ఫ్యూచర్‌ సిటీలో కొత్త భూమిపూజ. అమరావతిలో అర్ధరాత్రిళ్లు లైట్ల వెలుతురు హడావిడి. పేపరు తెరిస్తే లక్షల కోట్ల పెట్టుబడుల హెడ్‌లైన్స్‌. పాలన అంటే నిర్మాణమూ లేదా కూల్చడమూ. కాని ఒక సమాజం ఎదిగిందనడానికి ఇటుకలూ కాంక్రీటు దిమ్మెలూ మెడెత్తి చూసే హార్మ్యాలూ తార్కాణాలు కాదు. ఒక గొప్ప కథ, నినాదం కాదగ్గ కవిత, జీవన దర్శనం చేయగల నవల, భాషను తోమి మెరిసేలా చేసే వచనం... ఇవీ నాగరికతకు ఆనవాళ్లు. మరి తెలుగులో అలాంటి ఆనవాళ్లుగా నిలిచే రచనలు ఎన్ని? ఏ కాలంలో అయినా అవి ఎందుకు కొన్ని? నిజమైన సృజనాత్మకతకు సెలవు రోజో, తీరిన సాయం సమయమో చాలదు. నాలుగు గదుల్లో కూచుని చేసే కృత్రిమ ఊహ పాఠకుడికి చీమిణ్ణి చూసిన ఏహ్యత కలిగిస్తుంది. ఆక్రమణకు గురయ్యే అభయారణ్యంలోని నెమలి క్రీంకారాన్ని వినిపించాలన్నా, సోలార్‌ పలకల దెబ్బకు దగా పడుతున్న పల్లె గుండెల నిట్టూర్పును చిత్రిక పట్టాలన్నా ఫీల్డ్‌కి వెళ్లాలి. చూడాలి. రోజుల తరబడి కలిసి బతకాలి. మనుషుల్ని తాకాలి. 

ఆ ఆలోచనల అస్థితిమితత్వంలో నుంచి వాక్యం పుట్టాలి. ఇవన్నీ చేయాలంటే రచయితకు పూర్తి సమయం అవసరం. కాని పొద్దున్నే బయోమెట్రిక్‌ పంచ్‌ కొట్టి, సాయంత్రపు ఖర్చుల బెంగతో ఉండే పొట్టకూటి ఉద్యోగైన రచయితకు ఆ తీరిక, ప్రశాంతత ఉండవు. ఆకలితో ఉన్న రచయిత రొట్టె గురించి రాస్తాడు సరే. కాని ఆదరువు ఉన్న రచయిత సమాజం మర్చిపోయిన ప్రశ్నలను, భయపడే నిజాలను, కలలు కనే భవిష్యత్తును రాస్తాడు. అలాంటి రచనలు రావాలన్నా, అలాంటి రచనల కోసం రచయితలు పూర్తి సమయం ఇవ్వాలన్నా సమాజం సరికొత్త తాత్త్విక భూమిక వైపు అడుగులు వేయాలి. అదే ‘రచయితను దత్తత తీసుకోవడం’. ‘అడాప్ట్‌ ఎ రైటర్‌’.

ఈ ‘దత్తత’ కొత్తదేం కాదు. పూర్వం ‘రాజాశ్రయం’ ఉండేది. పోషకులు ఉండేవారు. నేటి ఆధునిక ప్రజాస్వామ్యంలో బాధ్యత గల కార్పొరేట్‌ సంస్థలు, స్వచ్ఛంద వ్యవస్థలు, సంపన్న కుటుంబాలు ఉన్నాయి. పాశ్చాత్య దేశాలలో ఎప్పటి నుంచో ‘రైటర్‌–ఇన్‌– రెసిడెన్స్‌’ ప్రోగ్రామ్స్‌ నడుస్తున్నాయి. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు రచయితలకు ఉచిత వసతితో పాటు భారీ స్టై్టపెండ్‌ ఇచ్చి నవలలు రాయడానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాయి. నార్వే, స్వీడన్‌ తదితర దేశాలలో ప్రభుత్వాలే ప్రతిభావంతులైన రచయితలకు ‘గ్యారంటీడ్‌ మినిమం ఇన్ కమ్‌’ అందిస్తున్నాయి. మన దేశంలో కూడా ఒక కుటుంబం ఒక రచయితను దత్తత తీసుకోవచ్చు. ఒక సంస్థ ఒక సంవత్సరం చేయూత ఇవ్వవచ్చు. ఒక ప్రభుత్వం ‘ఆలోచించేవాడిని మేము గౌరవిస్తాం’ అనే స్పష్టమైన విధానాన్ని తేవచ్చు.

అయితే ఇలాంటి ప్రతిపాదన వినగానే ఇటు సాహిత్య పరివారంలో, అటు లౌకిక ప్రపంచంలో కొందరి అవహేళనలు మొదలైపోతాయి. ‘కూర్చోబెట్టి మేపితే రచయితలు సోమరులుగా మారరా?’ అని కొందరు ప్రశ్నించవచ్చు. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. దత్తత అనేది రచయితకు లభించే ఉచిత ‘విశ్రాంతి ప్యాకేజీ’ కాదు. అదొక పవిత్రమైన బాధ్యత. నిరూపించుకోవాల్సిన జవాబుదారీతనం. కేవలం దత్తత సొమ్మును అనుభవిస్తూ, ఒక్క పేజీ కూడా రాయకుండా కాలక్షేపం చేసే సోమరులకు దత్తతను రద్దు చేసే హక్కు సమాజానికి ఉంటుంది. ఇది విని ‘అబ్బే... వృథా’ అనేవారూ ఉంటారు. క్షణికానందాన్ని ఇచ్చే వినోదాలకు, ఆర్భాటపు డెస్టినేషన్‌ పెళ్లిళ్లకు, నాయకుల జన్మదినాలకు, ప్రభుత్వాల ప్రకటనలకు, సినిమాల్లో దిక్కుమాలిన గ్రాఫిక్స్‌కు కోట్లాది రూపాయలు వృథా అవుతున్న చోట రచయితలను రెండేళ్లో, ఐదేళ్లో అడాప్ట్‌ చేసుకొని ఇచ్చే వేల రూపాయల స్టైపెండ్‌ ఏ మూల? దాని గురించి మాట్లాడాల్సి రావడమే దురదృష్టం. 

ఒక రచయితను ఫుల్‌టైమ్‌ రచయితగా మార్చడానికై ఇచ్చే ఆర్థిక సౌలభ్యం దానం కాదు, భవిష్యత్తు మీద పెట్టుబడి. ఒక రచయిత బాగుంటే పది పుస్తకాలు వస్తాయి. ఆ పది పుస్తకాలు పది వేల మనసులను తాకుతాయి. ఆ పది వేల మనసులు ఒక అద్భుతమైన, ప్రశాంతమైన సమాజాన్ని కడతాయి. ‘గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో’ అన్నాడు దాశరథి. ధార్మికంగా చూసినా ఇది సరస్వతీ అర్చనే. రచయితను దత్తత తీసుకోండి. ఎందుకంటే రచయిత బతికితే సమాజంలో ఆలోచన బతికి ఉంటుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement