సహజీవన బంధాల్లో క్రూరత్వాన్ని ఎదుర్కొనే మహిళలకు ఊరటనిచ్చేలా గృహహింస చట్టం పరిధిని విస్తరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం వెలువరించిన తీర్పు మహిళలకు ఊరటనిస్తుంది. యుక్త వయసు వచ్చిన జంట పరస్పర అంగీకారంతో వివాహ వ్యవస్థ వెలుపల కూడా సహజీవనం సాగించవచ్చంటూ గతంలో న్యాయస్థానాలు పలు సందర్భాల్లో తెలిపాయి. అయినా ఇలాంటి బంధాలు తరచు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా కొన్ని రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరు కేసుల్లో ఈ బంధాల్లోని నైతికతను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. వివాహ బంధాల్లో ఉండే రక్షణలు సహజీవన బంధాల్లో ఉండబోవని హితోక్తులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వివాహ స్వభావం కలిగిన’ సహజీవన బంధంలో ఉండే భాగస్వామి నుంచి మహిళ హింసను ఎదుర్కొంటే ఐపీసీ సెక్షన్ 498ఏ(బీఎన్‌ఎస్ సెక్షన్లు 85, 86) కింద కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. పరస్పర అవగాహన ద్వారా ఒక జంట సహజీవనం చేస్తున్నప్పుడు ఆమెను హింసించే పరిస్థితులు తలెత్తినప్పుడు చట్టం ఆమెకు రక్షణగా నిలబడాలి. ఇప్పుడు తాజా తీర్పువల్ల అలాంటి మహిళలకు భద్రత ఉంటుంది.
నాలుగు దశాబ్దాల క్రితం చట్టం ఇంత స్పష్టంగా లేదు. అసలు మన చట్టాల్లో సహజీవన సంబంధాలకు ఎప్పుడూ చోటులేదు. కానీ 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం తొలిసారి ‘వివాహ స్వభావం’ కలిగిన సంబంధంలో ఉన్న మహిళ సమస్యలు ఎదుర్కొంటున్న పక్షంలో ఆమెను బాధిత పక్షంగా గుర్తించింది. ఆడ, మగ ఒకే ఇంట్లో కలిసివుంటూ జీవితభాగస్వాములన్న అభిప్రాయం సమాజంలో కలిగిస్తే, వారు పెళ్లీడుకొచ్చివుంటే, తగినంతకాలం శారీరక సంబంధంలో కొనసాగుతూవుంటే ఆ బంధాన్ని ‘వివాహ స్వభావం’గల బంధంగా గుర్తించవచ్చని సుప్రీంకోర్టు 2011లోనే ఒక కేసులో చెప్పింది. వారాంతాల్లో కలిసివున్నప్పుడు ఇది వర్తించబోదని తెలిపింది. కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పు పెళ్లికానంత మాత్రాన ఒక బంధంలో కొనసాగే పురుషుడు మహిళను హింసిస్తుంటే 498ఏ వర్తించబోదనటం సరికాదని వివరించింది. చట్టంలోని ‘భర్త’ అనే పదాన్ని మరీ సంకుచితంగా తీసుకుని యాంత్రికంగా వర్తింపజేసి బాధిత మహిళకు న్యాయం చేయకపోవటం సరికాదని ధర్మాసనం చెప్పడం గమనించదగింది. లాంఛనంగా పెళ్లి ధ్రువీకరణ పత్రం లేనంతమాత్రాన ఆ బంధంలోని వివాహ స్వభావాన్ని గుర్తించకపోవటం, అక్కడ జరిగే హింసను విస్మరించటం సమాజ పురోగతికి తోడ్పడబోదని కూడా తెలిపింది.
ఇద్దరు వ్యక్తులు సహజీవన బంధంలోకి వెళ్లి, వారి మధ్య తలెత్తే విభేదాలు మహిళను హింసించటానికి దారితీస్తే దాన్ని నేరంగా పరిగణించకపోవటం ఎలా చూసినా సరికాదు. సహజీవనంలోవుండే మహిళకు గృహహింస చట్టంకింద ఉన్న రక్షణలు సరిపోతాయనీ, అందువల్ల 498ఏ పరిధిని విస్తరించటం అనవసరమనీ ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం వాదించినా ధర్మాసనం దీన్ని దృష్టిలో ఉంచుకునే తోసిపుచ్చింది. గృహహింస చట్టం కేవలం మనోవర్తి, పరిహారం, ఇంట్లో కొనసాగే హక్కువంటి సివిల్ ఉపశమనాలు మాత్రమే ఇస్తున్నదని... ఆ నేరానికి తగిన శిక్ష ఉండొద్దా అని న్యాయమూర్తులు ప్రశ్నించటం గమనార్హం. ప్రస్తుత కేసులో మహిళ తాను వివాహానికి సిద్ధపడే ఈ సహజీవన బంధంలోకి ప్రవేశించాననీ, కానీ అప్పటికే అతగాడికి పెళ్లయిన విషయాన్ని దాచాడనీ తెలిపింది. సుప్రీంకోర్టు ఈ కేసులోని నిజానిజాల్లోకి పోకుండానే మహిâ¶ క్రూరత్వాన్ని చవిచూస్తుంటే 498ఏ వర్తించితీరాలని తెలిపింది.
చట్టాలు చేసే సందర్భాల్లో పార్లమెంటు అవగాహనకు రాని విషయాలు, అప్పటికి అలాంటి పరిస్థితులు లేని సందర్భాలు అనంతర కాలంలో తలెత్తవచ్చు. అంతమాత్రాన సమాజంలో వచ్చిన మార్పుల్ని పరిగణనలోకి తీసుకోకుండా యాంత్రికంగా అన్వయించటంతో సరిపెడితే బాధితులకు ఎప్పటికీ న్యాయం దక్కదు. అయితే సహజీవనానికి సంబంధించి నిర్దిష్టమైన చట్టం లేకపోవటం వల్ల ఇలాంటి బంధాల్లో ఏర్పడే సమస్యల విషయంలో వచ్చే కేసుల్ని న్యాయస్థానాలు పదే పదే విచారించి తేల్చవలసి వస్తున్నది. కనుక వర్తమాన సామాజిక స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకుని ఆ మాదిరి చట్టం అవసరాన్ని ప్రభుత్వం గుర్తించటం అవసరం.


