న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిరసనల వేదికగా పేరొందిన జంతర్ మంతర్‌పై సుప్రీం కోర్టు కీలక విచారణ చేపట్టింది. జంతర్ మంతర్ స్థానంలో నిరసనలకు మరో ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందించిన ధర్మాసనం.. సోమవారం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
జంతర్ మంతర్ వద్ద తరచూ జరిగే ధర్నాలు, ఆందోళనల కారణంగా సెంట్రల్ ఢిల్లీలో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని పిటిషనర్ సతీశ్ చంద్ర కౌశిక్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, నిత్యావసర వస్తువులు, వైద్య అవసరాల సరఫరాపైనా ప్రభావం పడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను ఇవాళ పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇందులో ప్రజల రాకపోకలు, ప్రాంతంలో అందుబాటు వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ అంశంపై కేంద్రం నుంచి వివరాలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది.
జంతర్ మంతర్ ఇకపై నిరసనలకు అనువైన ప్రదేశం కాదని, ట్రాఫిక్ సమస్యలు, స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలని పిటిషన్‌లో కోరారు. ముఖ్యంగా వైద్య సేవలకు సంబంధించిన సరఫరాలు, అత్యవసర రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఇటీవలి కొన్ని రాజకీయ నిరసనలను ప్రస్తావించినప్పటికీ.. ప్రతిపాదిత కార్యక్రమాలపై వ్యాఖ్యానించేందుకు ధర్మాసనం నిరాకరించింది. చట్ట ప్రకారం అధికారులు పరిస్థితులను నిర్వహిస్తారని పేర్కొంది.
ప్రజాస్వామ్యంలో నిరసనలకు హక్కు ఉన్నప్పటికీ.. అదే సమయంలో సాధారణ ప్రజల రాకపోకలు, అత్యవసర సేవలకు ఇబ్బంది కలగకుండా సమతుల్యం పాటించాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని ఈ పిటిషన్ తెరపైకి తెచ్చింది. ఇప్పుడు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చే సమాధానంపై తదుపరి పరిణామాలు ఆధారపడనున్నాయి.


