దళితులపై దాడులకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ధర్నా | Ysrcp Protest At Tirupati Rural Police Station | Sakshi
Sakshi News home page

దళితులపై దాడులకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ధర్నా

Aug 2 2026 11:30 AM | Updated on Aug 2 2026 12:40 PM

Ysrcp Protest At Tirupati Rural Police Station

సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళనకు దిగింది. దళితులపై దాడులుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా నిర్వహించారు. పీఎస్‌ ఎదుట భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ నేతలు బైఠాయించారు. అవిలాల మాజీ సర్పంచ్‌పై దాడి చేసిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్‌ చేయాలని భూమన డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీకి దళిత సంఘాలు మద్దతు తెలిపాయి.

తిరుపతి రూరల్‌ మండలం అవిలాల గ్రామ పంచా­యతీ పరిధిలోని సర్వే నంబరు 145లో ఉన్న మఠం భూము­లను కొందరు టీడీపీ నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. పంచాయతీవాసుల దాహార్తిని తీర్చేం­దుకు గతంలో ఏర్పాటుచేసుకున్న బోరునూ ఆక్రమించారు. నీటి సరఫరా నిలిపివేయడంతో అవిలాల మాజీ సర్పంచ్‌ వెంకటరమణతో పాటు దళితవాడ వాసు­లు, అంబేడ్కరిస్టులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేశారు.

అయినా ఆక్రమణదారులు పనులు ఆపకపోవడంతో శనివారం అంబేడ్కర్‌ ఫొటోతో కూడిన బ్యానర్‌ను ముద్రించుకుని బోరు వద్దకు దళితవాడ వాసులు చేరుకుని భూ ఆక్రమణదారుల నుంచి పంచాయతీ బోరును కాపాడాలని నినదించారు. అదే సమయానికి భూ ఆక్రమణకు పాల్పడిన వారంతా అక్కడకు చేరు­కుని దళితులపై రెచ్చిపోయారు. బూతు పంచాంగం లం­కించుకున్నారు. నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. అంబేడ్కర్‌ చిత్రపటంతో కూడిన బ్యానర్‌ను చింపేసి పరుష పదజాలంతో దళిత జాతిని అవమానించేలా తిడుతూ దొరికిన వారిని దొరికినట్టు కొట్టారు. ప్రాణ భయంతో కేకలు పెడుతూ మహిళలు పరుగులు తీయగా వెంటాడి కొట్టారు. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగినా వారు కిమ్మనలేదు. చోద్యం చూస్తుండిపోయారు.

టీడీపీ గూండాల దాడిలో గాయపడిన అవిలాల పంచాయతీ మాజీ సర్పంచ్‌ వెంకటరమణ, కౌసల్య, విజయ నిర్మల, ప్రసాద్, యాదగిరిలను చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి పరామర్శించారు. దళితులపై దాడి హేయమైన చర్యలని మండిపడ్డారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement