లబ్బీపేట(విజయవాడ): ఆర్‌ఎంపీతో ట్రీట్‌మెంట్ చేయించారా? మృతదేహం వివరాలు స్వర్గపురి రికార్డుల్లో రాయకుండా ఎందుకు ఒత్తిడి చేశారు? సాయికృష్ణ తల్లిని బెదిరించారా? నీ కొడుకు చనిపోయాడు.. ఫొటోకు దండవేసుకో.. అని అన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ మాజీ సీఐ నాగరాజు నుంచి మౌనమే సమాధానమైంది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజును మూడో రోజు శనివారం సిట్ విచారించింది. సుమారు 8 గంటల పాటు ఈ విచారణ సాగింది.
సిట్ అధికారులు ఏ ప్రశ్న అడిగినా నాగరాజు తనకేమీ తెలియదని, సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో నిందితులైన కానిస్టేబుళ్లు, నాగరాజు అనుచరుడు, ఆర్‌ఎంపీని విచారించి వివరాలు రాబట్టారు. ఆ వివరాల ఆధారంగా నాగరాజును సిట్ ప్రశ్నిస్తోంది. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, మృతదేహాన్ని మాయం చేయడం వంటి అంశాలపై ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో రక్తపు మరకలు లేకుండా చేయడంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.
సాయికృష్ణను ఎవరి ఆదేశాలతో స్టేషన్‌కు తీసుకు వచ్చారని ప్రశ్నించగా, తనకేమీ సంబంధం లేదని నాగరాజు చెప్పినట్లు తెలిసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అవేమీ తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరా పుటేజీ ఎందుకు డిలీట్ అయిందని ప్రశ్నించగా తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. మరికొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది.


