‘నాకే నమస్తే పెడుతావా’ | Hindupuram CI Rajagopal Naidu Overaction | Sakshi
Sakshi News home page

‘నాకే నమస్తే పెడుతావా’

Aug 2 2026 10:06 AM | Updated on Aug 2 2026 10:09 AM

Hindupuram CI Rajagopal Naidu Overaction

సాక్షి పుట్టపర్తి : నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పట్టణంలో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయి. సీఐ రాజగోపాల్‌నాయుడు నిర్వాకంతో పరిస్థితులు దారుణంగా మారాయి. నిబంధలన్నీ పక్కనపెట్టి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆయన ‘తమ్ముళ్లు’ చెప్పిన వారిపై ఏకపక్షంగా కేసులు కడుతున్నారు. తనకు ఎదురు తిరిగిన వారిపై లాఠీ ఝుళిపిస్తున్నాడు. చివరకు న్యాయవాదులను సైతం కేసుల్లో ఇరికిస్తున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన వారిని కులం పేరుతో దూషిస్తూ.. బూతులు తిడుతూ బూటు కాళ్లతో తంతున్నారు. ఎవరు ఆయన వద్దకు వెళ్లినా మాటకు ముందు బాలకృష్ణ..చంద్రబాబు పేర్లు ప్రస్తావిస్తూ వారూ తాను ఒకే సామాజిక వర్గమని, ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా తనకేం    కాదంటూ అందరినీ భయపెడుతున్నారు.  

అంతా ‘పచ్చ’పాతం.. 
సీఐ రాజగోపాల్‌నాయుడు గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో (2014 – 2019)      హిందూపురం సీఐగా పని చేశారు. ఆ తర్వాత ఐదేళ్లు కనుమరుగయ్యారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్లీ హిందూపురం వన్‌ టౌన్‌ సీఐగా బాధ్యతలు తీసుకున్నారు. విధుల్లో చేరిన రోజు నుంచే వైఎస్సార్‌సీపీ నేతలు, లాయర్లు, దళితులను టార్గెట్‌ చేసి నిత్యం వివాదాల్లో నిలుస్తున్నారు. అతని వ్యవహారశైలితో అధికార పార్టీ నేతలే విసిగిపోయినా తన సామాజికవర్గం పేరు చెప్పి వారినీ భయపెడుతున్నారు.  

అధికార పార్టీ నేతల అండతోనే.. 
సీఐ రాజగోపాల్‌ నాయుడు పచ్చ చొక్కా వేసుకున్న తెలుగు తమ్ముడిలా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో విధులు నిర్వర్తిస్తూ సామాన్యులపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు ‘తెలుగు తమ్ముళ్లు’ ఎన్ని దుర్మార్గాలకు ఒడిగట్టినా, దౌర్జన్యాలు చేసినా కనీస చర్యలు తీసుకోవడం లేదంటున్నారు. అందువల్లే హిందూపురంలో శాంతి భద్రతలు లోపించాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దౌర్జన్యాలు, అరాచకాలు, చోరీలు భారీగా పెరిగినా..పట్టించుకోని సీఐ కేవలం వైఎస్సార్‌సీపీ నేతలు, దళితులు, లాయర్లపై జులుం ప్రదర్శించడమే తన విధిగా భావిస్తున్నారు. దీంతో సీఐని సస్పెండ్‌ చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్‌ ఎదురైంది.  

దళిత లాయరుపై బూటుకాలితో దాడి.. 
వారం రోజుల క్రితం ప్రసవం కోసం హిందూపురం ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళ...డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె తరఫు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆస్పత్రి నిర్వాహకులతో ఓ న్యాయవాది వాదిస్తుండగా.. సీఐ రాజగోపాల్‌నాయుడు అక్కడికి చేరుకుని న్యాయవాదిని బూతులు తిట్టడంతో పాటు బూటుకాలితో తన్నారు. దీంతో దళిత సంఘాల నాయకులు రోడ్డెక్కారు. నాలుగు రోజులుగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. సీఐని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, హిందూపురంలో ర్యాలీలు చేశారు.   

లెక్క లేనన్ని అరాచకాలు.. 
పోలీసుల అలసత్వం.. సీఐ రాజగోపాల్‌ నాయుడు సహకారంతో హిందూపురంలో  కూటమిలోని పార్టీల నాయకుల అరాచకాలు పెచ్చుమీరాయి. అక్రమ మద్యం, గుట్కా, గంజాయి విక్రయాలు, విచ్చలవిడిగా జూదం, బెల్టు షాపుల నిర్వహణ, పశుమాంసం అక్రమ రవాణా, రేషన్‌ బియ్యం    దందాలకు హిందూపురాన్ని అడ్డాగా మార్చేశారు. ఇదే అదనుగా దొంగలూ రెచ్చిపోతున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే చోరీలకు తెగబడుతున్నారు. అక్రమాల గురించి ముందుగానే కానిస్టేబుళ్లు చెప్పినా...‘చూద్దాం..చేద్దాం’ అంటూ నాన్చుతున్నారు. వయస్సులో పెద్దవారైన సిబ్బంది ఎవరైనా గట్టిగా చెబితే మాత్రం ‘చట్టం తన పని తాను చేస్తుంది’ అంటూ డైలాగులు చెబుతున్నారు.  

ఎఫ్‌ఐఆర్‌లతోనే సరి.. 
స్టేషన్‌కు ఏ సమస్యతో వెళ్లినా సీఐ రాజగోపాల్‌ నాయుడు కేసులు కట్టరు. ఎవరైనా ఒత్తిడి చేసినా ఎఫ్‌ఐఆర్‌తో సరిపెడతారు. చివరకు చోరీ కేసులు కూడా ఎఫ్‌ఐఆర్‌ చేసి విడిచిపెడతారు. అందువల్లే కేసుల సంఖ్య పెరిగిపోతున్నా...రికవరీలు మాత్రం లేవు. రాత్రి వేళల్లో అరాచకశక్తులు ఘర్షణలకు దిగి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా అటువైపు కన్నెత్తి చూడవద్దని సిబ్బందికి ఆర్డర్లు వేస్తారు. మనపని అదికాదంటూ పోలీసులకు కొత్తగా ఉద్యోగం నేరి్పస్తున్నారు.

గతేడాది ఆగస్టు 23వ తేదీన హిందూపురం వన్‌టౌన్‌ సీఐ రాజగోపాల్‌నాయుడు రాత్రి వేళ గస్తీ తిరుగుతున్నారు. ఆ సమయంలో తన వస్త్ర దుకాణం వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ నేత ఆసీఫుల్లా సీఐని చూసి గౌరవంతో నమస్తే పెట్టారు. అయితే ‘నాకే నమస్తే పెడుతావా’ అంటూ అతన్ని స్టేషన్‌కు తీసుకెళ్లిన చిత్రహింసలకు గురి చేశాడు. వైఎస్సార్‌సీపీ నాయకులందరూ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు.  

ఈ ఏడాది ఏప్రిల్‌ 15వ తేదీన మున్సిపల్‌ అధికారులకు.. న్యాయవాదులకు తగాదా ఏర్పడింది. అక్కడికి చేరుకున్న సీఐ రాజగోపాల్‌నాయుడు... సర్దిజెప్పాల్సింది పోయి మున్సిపల్‌ అధికారులకు వత్తాసు పలుకుతూ ఏకపక్షంగా వ్యవహరించారు. దీంతో అప్పట్లోనే సీఐ రాజగోపాల్‌నాయుడుపై న్యాయవాదులు తిరుగుబాటు చేశారు. మున్సిపల్‌ అధికారులు ఫిర్యాదు చేయకపోయినా... అక్కడకు వెళ్లిన సీఐ రాజగోపాల్‌నాయుడు   న్యాయవాదులను దుర్భాషలాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement