మదనపల్లె టౌన్: సత్యసాయి జిల్లా కదిరి డిపోలో చోరీకి గురైన ఆర్టీసీ బస్సు అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పోలీసులకు చిక్కింది. ఈ కేసులో నిందితుడైన శివ మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. అనంతపురానికి చెందిన శివ తన కుక్కను వెంట తీసుకుని మద్యం మత్తులో అనంతపురం నుంచి రైలులో కదిరికి వచ్చాడు.
చార్జీలకు డబ్బు లేకపోవడంతో అర్ధరాత్రి కదిరి బస్టాండ్ పక్కన పార్క్ చేసిన ఆర్టీసీ అద్దె బస్సును అపహరించి దాంట్లో మదనపల్లెకు వచ్చాడు. శనివారం ఉదయం తట్టివారిపల్లి బైపాస్ వద్ద బస్సును రోడ్డుపైనే వదిలేసి టూ టౌన్ పోలీసులకు లొంగిపోయాడు. జరిగినదంతా చెప్పడంతో పోలీసులు స్థానిక ఆర్టీసీ అధికారులతో పాటు కదిరి ఆర్టీసీ అధికారులకు సమాచారమిచ్చారు. బస్సు అసలు డ్రైవర్ శివకుమార్ ఆగమేఘాలపై మదనపల్లికి వచ్చాడు.
అద్దె బస్సు కావడంతో ‘ఓనర్ ఆదేశాలతో బస్సుకు డీజిల్ పట్టి రాత్రి పార్కింగ్ చేసిన కొన్ని క్షణాల్లోనే బస్సును ఎత్తుకెళ్లాడు’ అని ఆయన చెప్పాడు. పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని డిపోలో భద్రపరిచారు. కదిరి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, శివ అటవీ శాఖలో తాత్కాలిక ఉద్యోగి. ఇటీవలే ఆయనను విధుల నుంచి తొలగించగా తీవ్ర మనస్తాపం చెంది రోజూ మద్యం తాగుతున్నాడు. దీంతో ఆయన మానసిక స్థితి బాగాలేదని తెలుస్తోంది.


