లేదంటే.. ఆత్మహత్య చేసుకునేలా చేస్తాం
మదనపల్లె సబ్ రిజిస్ట్రార్కు కబ్జాకోరుల బెదిరింపులు
నిందితుల్లో ఒకరు జనసేన నాయకుడు
తప్పుడు పత్రాలతో 50 కోట్ల భూ రిజిస్ట్రేషన్‌కు యత్నం
రిజిస్ట్రేషన్‌కు నిరాకరించడంతో బెదిరింపులకు దిగిన వైనం
మదనపల్లె టౌన్: నకిలీ దస్తావేజులు, ఫోర్జరీ సర్టిఫికెట్లతో రూ.50 కోట్ల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో కొందరు భూ కబ్జాకోరులు విశ్వ ప్రయత్నాలు చేశారు. భూ రిజిస్ట్రేషన్‌కు నిరాకరించిన సబ్ రిజిస్ట్రార్ను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ... బెదిరింపులకు దిగారు. స్థానిక జనసేన నాయకుడు బాలగణేష్ (45)సహా బాల సరస్వతమ్మ (69), వెంగళ ఉమానరేష్ (47).. మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఎం.గురుస్వామి వద్దకు శుక్రవారం వచ్చారు. బండమీదకమ్మపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 303/1లో గల రూ.కోట్ల విలువైన భూమికి సంబంధించిన విక్రయ దస్తావేజు, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీని రిజి్రస్టేషన్ చేయాలన్నారు.
సబ్ రిజిస్ట్రార్ ఆ దస్తావేజులను ఆఫీసు రికార్డులతో సరిపోల్చగా, పూర్తి వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. ఈసీ పరిశీలనలోనూ ఇదే స్పష్టమయ్యింది. నిందితులు జతపరిచిన 08–12–2017 నాటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్ మీసేవ పోర్టల్ ద్వారా పరిశీలించగా అది నకిలీదని తేలింది. ఈ ఆస్తికి అసలైన యజమానులు ఎన్.రవీంద్రనాథ్, ఆయన భార్య అని, తన వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులకు సదరు ఆస్తిపై ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవని తేలింది. అసలైన భూమి యజమానులను మోసగించి ఆస్తిని కాజేసేందుకే ఈ నకిలీ పత్రాలు సృష్టించినట్లు సబ్ రిజిస్ట్రార్ గుర్తించి.. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం తగదని ముగ్గురినీ హెచ్చరించారు.
ఈ సందర్భంలో నిందితులు ఉమానరేష్, బాల గణేష్ లు సబ్ రిజిస్ట్రార్ను తీవ్రంగా బెదిరించారు. ‘ఇది నకిలీ దస్తావేజే అని మాకూ తెలుసు.. రిజిస్టర్ చేసేయ్. మిగతాది మేము చూసుకుంటాం. లేదంటే నిన్ను కిడ్నాప్ చేస్తాం. ఉద్యోగం నుంచి తీయించేస్తాం. ప్రతిరోజూ సంబంధిత ఉన్నతాధికారులకు తప్పుడు ఫిర్యాదులు పంపి, డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీలు వేయించి ఆత్మహత్య చేసుకునేలా చేస్తాం’ అంటూ వేధించారు. అంతటితో ఆగకుండా, సబ్ రిజిస్ట్రార్ ద్వారా రూ.100 కోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందంటూ జిల్లా కలెక్టర్‌కు వాట్సాప్ చేయడమే కాకుండా... సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు.
తీవ్ర మానసిక ఆందోళనకు గురైన సబ్ రిజిస్ట్రార్ పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై మదనపల్లె వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్లో ఏ–2గా ఉన్న ఉమానరేష్ ను శనివారం అరెస్టు చేశారు. ఏ–1 బాల సరస్వతి, ఏ–3 బాలగణేష్ పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించేందుకు సహకరించిన సాక్షులు, ఇతరులను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు.


