బాండ్ల ద్వారా సేకరించే రూ.1,010.58 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ ఉండదని పేర్కొంటూ ఇచ్చిన జీఓ
పూల్డ్ మున్సిపల్ బాండ్ల విధానం అమల్లోకి..
బాండ్ల ద్వారా రూ.1,010.58 కోట్లు సేకరించాలని నిర్ణయం
ఇన్వెస్టర్లకు విలువైన ఆస్తులు చూపించాలని మెలిక
వాటిని తీర్చే బాధ్యత కూడా పట్టణ స్థానిక సంస్థలదే
బాండ్ల పేరుతో ప్రజలపై సర్కారు భారం వేస్తోందంటున్న నిపుణులు
పట్టణ స్థానిక సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయని ఆందోళన
మౌలిక వసతుల కల్పన బాధ్యత నుంచి తప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం
విధివిధానాలు ఖరారు చేస్తూ జీఓ–151 జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు (యూఎల్‌బీ) ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నామనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన ముసుగులో సరికొత్తగా ‘పూల్డ్ మున్సిపల్ బాండ్’ విధానం తీసుకొచ్చింది. దీనికింద నిధులు సేకరించాలంటే ఆయా మున్సిపాలిటీలు నమ్మకమైన ఆదాయ వనరులు చూపించాలి. ఈ మేరకు చంద్రబాబు సర్కారు శనివారం జీఓ–151 జారీచేసింది. ఇందులో బాండ్ల ఫ్రేమ్‌వర్క్‌తో పాటు విధివిధానాలను వెల్లడించింది. అయితే, ఈ విధానంతో పట్టణ ప్రజల నెత్తిన పన్నుల భారం మోపే అవకాశముందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వ గ్యారెంటీ లేదు..
ఈ బాండ్ల జారీవల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారంపడదని జీఓలో ప్రభుత్వం పేర్కొనడంతో భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్టు విఫలమై బాండ్ల చెల్లింపులకు నిధులు సరిపోకపోతే, ఆ భారం అంతా స్థానిక సంస్థల ఆదాయ వనరుల మీద పడే అవకాశముంది. ప్రభుత్వ గ్యారెంటీలేని ఈ బాండ్లను కొనుగోలు చేసే ఇన్వెస్టర్లకు భరోసా కల్పించడానికి, ఆదాయాన్ని ఆర్జించే మున్సిపల్ ఆస్తులను తాకట్టు పెట్టాలనే నిబంధన పెట్టడం గమనార్హం.
ఆస్తులు తాకట్టు.. రూ.1,010.58 కోట్ల సేకరణ టార్గెట్..
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణ స్థానిక సంస్థల్లో సుమారు రూ.1,122.86 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పలు ప్రాజెక్టుల కోసం రూ.1,010.58 కోట్లు సమీకరించాలన్న చంద్రబాబు ప్రభుత్వ వ్యూహం వెనుక భారీ కుట్ర పొంచి ఉంది. కీలకమైన మున్సిపల్ ఆస్తులను చూపి బాండ్ల ద్వారా అప్పులు తెచ్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించడమంటే.. ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తేవడమేనని నిపుణులు తేల్చిచెబుతున్నారు. మరోవైపు.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలో గ్రీన్‌బాండ్లు జారీచేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
వడ్డీ భారం పెరిగితే ప్రజలపై పన్నుల బాదుడు..
బాండ్ల ద్వారా వచ్చిన నిధులతో చేపట్టే ప్రాజెక్టుల ద్వారా రాబడి కంటే, ఆ బాండ్లకు చెల్లించాల్సిన ‘కూపన్’ (వడ్డీ) భారం భారీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితంగా మున్ముందు సామాన్యుడిపై ఆస్తిపన్ను, నీటి పన్ను భారాలు మోపడానికి బాబు సర్కారు సిద్ధమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఈ బాండ్ల జారీ ప్రక్రియలో ప్రభుత్వం పక్కకు తప్పుకుంది. ఏపీ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఏపీయూఐఏఎంఎల్)కు బాధ్యతలు అప్పగించింది. ప్రాజెక్టు నివేదికలు, క్రెడిట్ రేటింగ్స్ అంటూ సాగే ఈ ప్రక్రియలో మర్చంట్ బ్యాంకర్ల పాత్రే కీలకం.
ప్రభుత్వ పర్యవేక్షణ నామమాత్రంగా ఉంటుంది. ప్రైవేటు శక్తులకు మార్కెట్ ఆధారిత అప్పుల రూపకల్పనను అప్పగించడంవల్ల పట్టణాల ఆర్థిక భవితవ్యం ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే.. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలు సొంతంగా మార్కెట్‌లోకి వెళ్లి నిధులు తెచ్చుకునే సామర్థ్యంలేదు. దీంతో.. ప్రభుత్వం పలు సంస్థలను ఒకే వేదికపైకి తెచ్చి ఈ పూల్డ్ విధానం తెచ్చింది. దీనివల్ల ఇప్పటికే డ్రెయిన్ల నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలను కూడా చేపట్టలేని చిన్నచిన్న మున్సిపాలిటీలు సైతం పెద్ద మున్సిపాలిటీలతో పాటు అప్పుల ఊబిలోకి వెళ్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
వ్యాపారంగా మున్సిపల్ పాలన..
ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత నుంచి చంద్రబాబు ప్రభుత్వం తప్పించుకుంటోంది. తాగునీరు, డ్రెయిన్లు, రోడ్లు, వీధి దీపాలు వంటి సేవలను ప్రభుత్వం అందించాలి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం క్యాపిటల్ మార్కెట్‌కు ముడిపెట్టి మున్సిపల్ పాలనను పౌర సేవల కోణంలో కాకుండా ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చేపెట్టే వ్యాపారంగా మార్చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ బాండ్లవల్లే కాకుండా, బాండ్ల చెల్లింపుల కోసం పట్టణ స్థానిక సంస్థలు నిరంతరం ఒత్తిడికి లోనుకావాల్సి ఉంటుంది. ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగినా, ఆదాయం రాకున్నా ఆ ప్రభావం మున్సిపల్ పాలనపైనే పడుతుంది. ప్రజా ప్రతినిధులు కేవలం బాండ్ల చెల్లింపులకే పరిమితమై, అభివృద్ధిని గాలికి వదిలేసే ప్రమాదం ఉందన్న ఆందోళనను స్థానిక అధికారులు వ్యక్తంచేస్తున్నారు. అభివృద్ధికి నిధుల సేకరణ అవసరమే అయినా మున్సిపల్ ఆస్తులను తాకట్టు పెట్టి, మున్సిపాలిటీలను అప్పుల కుప్పలుగా మార్చేలా ఉండకూడదని నిపుణులు పేర్కొంటున్నారు.
స్క్రీనింగ్ కమిటీ పర్యవేక్షణ..
ఈ బాండ్ల జారీ ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఉన్నత స్థాయి స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటుచేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్థిక శాఖ, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్.. ఏపీ పబ్లిక్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ప్రోగ్రామ్ మేనేజర్‌గా ఏపీయూఐఏఎంఎల్ వ్యవహరిస్తూ సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.


