నౌకాదళాధికారులు, మహేంద్రగిరి వార్‌షిప్ సిబ్బందితో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నేవీ చీఫ్ అడ్మిరల్ స్వామినాథన్
యువ పారిశ్రామికవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు
విశాఖలో మహేంద్రగిరి యుద్ధ నౌకని జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి
ఒకే సీ ట్రయిల్‌తో మహేంద్రగిరి రికార్డు.. 75 నెలల్లోనే నిర్మాణం
సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ వ్యవస్థను మరింతగా పటిష్టం చేయడంలో యువ పారిశ్రామికవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలు భాగస్వాములు కావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతతో ముంబైలోని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ‘ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి’ భారత నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశించింది.
శనివారం విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ శాఖ మంత్రి ఈ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ అత్యాధునిక యుద్ధనౌక ‘ఆత్మ నిర్భర్ భారత్’ ఆశయాలకు గొప్ప ప్రతీకగా అభివర్ణించారు. సముద్ర జలాల్లో మన డిజైన్ సామర్థ్యాలకు, నౌకా నిర్మాణ వ్యవస్థ అభివృద్ధికి ఇది స్పష్టమైన ప్రతిబింబమని చెప్పారు. సాధారణంగా ఒక యుద్ధ నౌకకు 5 నుంచి 7 సీ ట్రయిల్స్ నిర్వహిస్తారని, కానీ మహేంద్రగిరి నౌక కేవలం ఒకే ఒక్క సీ–ట్రయల్‌తో విజయవంతంగా నౌకా దళంలో చేరడం విశేషమని అన్నారు.
అలాగే ఒక నౌక నిర్మాణానికి 95 నెలలు సమయం పడుతుందని, కానీ ఈ నౌక 20 నెలల సమయాన్ని ఆదా చేసి 75 నెలల్లోనే పూర్తవడం మరో విశేషమన్నారు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ భారత నౌకాదళం ఎల్లప్పుడూ యుద్దానికి సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, మజ్‌గాన్ డాక్ సీఎండీ కెప్టెన్ జగ్‌మోహన్, నౌకాదళ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


