ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
పొరపాటున తొమ్మిది రోజుల ముందే జైలు నుంచి రిలీజ్..
తప్పు దిద్దుకుని తిరిగి కారాగారానికి తరలించిన వైనం...
హైదరాబాద్: డ్రంకన్ డ్రైవ్ కేసులో 14 రోజుల జైలు శిక్ష పడిన ఓ మందు బాబును చంచల్‌గూడ జైలు సిబ్బంది పొరపాటున శిక్ష పూర్తవకుండానే..తొమ్మిది రోజులు ముందే విడుదల చేశారు. చివరకు తప్పు తెలుసుకుని.. మళ్లీ అతన్ని ఒక రోజు తర్వాత జైలుకు తరలించారు. ఈ ఘటన కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అంబర్‌పేటకు చెందిన మనోహర్ ఈ నెల మొదటి వారంలో మద్యం తాగి బైకు నడుపుతూ కాచిగూడ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు.
అతన్ని 9వ తేదీన నాంపల్లి 8వ ఎంజేఎఫ్‌సీ కోర్టులో హాజరుపరచగా రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడినందుకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. దీంతో మనోహర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. 14 రోజులు జైల్లో పెట్టాల్సిన జైలు అధికారులు అతన్ని 5 రోజులకే విడుదల చేశారు. మరుసటి రోజు తప్పు గుర్తించిన జైలు అధికారులు మనోహర్‌ను తిరిగి జైలు తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కాచిగూడ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఎట్టకేలకు మనోహర్ ఆచూకీ తెలుసుకుని..అయోమయానికి గురైన అతనికి జరిగిన తప్పిదాన్ని వివరించి..అతికష్టం మీద తిరిగి గురువారం చంచల్‌గూడ జైలుకు తరలించారు.


