నీట్ ర్యాంకర్ సహ్యూను అభినందిస్తున్న ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి
ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు పొందడమే లక్ష్యంగా చదివా
కార్డియాక్ సర్జన్ కావాలని ఉంది
‘సాక్షి’తో నీట్ ఆలిండియా 13వ ర్యాంకర్ వీరయ్యగారి సహ్యూ
హనుమకొండ: ‘నాకు కార్డియాక్ సర్జన్ కావాలని ఉంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రవేశం పొందడమే లక్ష్యంగా నీట్ పరీక్షకు ప్రిపేర్ అయ్యా. మొదటిసారి నిర్వహించిన నీట్ పేపర్ లీక్ వల్ల రద్దయినప్పటికీ మనోధైర్యం కోల్పోకుండా మరింత పట్టుదలతో చదివా. కష్టానికి తగిన ఫలితం లభించింది’అని నీట్–యూజీ 2026 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 13వ ర్యాంక్ సాధించిన వీరయ్యగారి సహ్యూ తెలిపాడు. వరంగల్‌కు చెందిన డాక్టర్ వీరయ్యగారి రమాకాంత్, డాక్టర్ శ్రీదేవి దంపతుల కుమారుడైన సహ్యూ తన నీట్ ప్రిపరేషన్ గురించి శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడాడు.
వివరాలు అతని మాటల్లోనే.. ‘మొదటిసారి నీట్ పరీక్ష సులువుగా ఉంది. రెండోసారి మాత్రం కఠినంగా ఉంది. అయినా సబ్జెక్ట్‌పై ఉన్న పట్టుతో అవలీలగా రాశా. నీట్ పరీక్షకు ముందు 108 సార్లు గ్రాండ్ టెస్ట్‌లు రాశా. దీంతోపాటు వీక్లీ పరీక్షలు 500కుపైగా రాశా. ఈ పరీక్షల ద్వారా నా ప్రతిభకు పదును పెట్టడంతోపాటు సమయపాలన అలవర్చుకున్నా.‘నా తండ్రి రమాకాంత్ తన గురువైన ప్రముఖ సర్జన్ వేదుల సత్యనారాయణమూర్తి సేవలను పదేపదే గుర్తుచేసేవారు. ఆయన గురించి గొప్పగా చెప్పేవారు. అది విన్నప్పుడల్లా నేను డాక్టర్ కావాలని లక్ష్యం నిర్దేశించుకున్నా.
దీంతోపాటు వైద్యులైన నా తల్లిదండ్రుల స్ఫూర్తితో నేను కూడా డాక్టర్ కావాలనుకున్నా. నేను ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఎస్‌ఆర్ కాలేజీలో ఇంటర్ చదువుతూనే నీట్ పరీక్షకు సిద్ధమయ్యా. కాలేజీలో అధ్యాపకుల నుంచి మంచి సహకారం లభించింది. నేను ఈ ర్యాంకు సాధించడంలో తల్లిదండ్రులు, ఎస్‌ఆర్ కాలేజ్ అధ్యాపకుల ప్రోత్సాహం ఎంతో ఉంది’అని సహ్యూ వివరించాడు.


