వాపు తగ్గడానికి మెడపై కొరికిన భూతవైద్యుడు
భద్రాచలంలో చికిత్స చేస్తుండగా కన్నుమూత
భద్రాచలం అర్బన్: అనారోగ్యంతో బాధపడుతున్న ఆరు నెలల గర్భిణిని భూతవైద్యుడిగా చెప్పుకునే వ్యక్తి వద్దకు తీసుకెళ్లారు. అతడు చేసిన మొరటు వైద్యంతో ఆమె ఆరోగ్యం విషమించింది. ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగానే మృతి చెందింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, కుంట మండలం, మారాయిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ కురసం హెన్కి (35)కి ఇటీవల మెడ, ముఖంపై వాపు వచ్చింది.
కుటుంబ సభ్యులు మంగళవారం నాడు ఆమెను ఆ గ్రామ సమీపంలోని భూత వైద్యుడు (ఆదివాసీలు వీరిని వెజ్జి, బుగ్గి వడ్డే, వడ్డే అని పిలుస్తారు)గా చెప్పుకునే వ్యక్తి వద్దకు తీసుకెళ్లారు. అతడు మెడ వాపు తగ్గిస్తానని హెన్కీ మెడపై పళ్లతో గట్టిగా కొరికాడు. ఆమె నొప్పితో విలవిల్లాడుతూ స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు, అతడి సూచనతో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.
ఐసీయూలో చికిత్స
హాస్పిటల్‌కు వచ్చేటప్పటికే ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు ఇన్‌ట్యూబేషన్ పద్ధతి ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ ఐసీయూలో చేర్చి వైద్యం మొదలుపెట్టారు. బుధవారంనాడు వైద్యులు ఆమె కోలుకుంటోందన్నారు. కానీ గురువారం అర్ధరాత్రి దాటాక ఆరోగ్యం విషమించి హెన్కీ మృతి చెందింది. ఆదివాసీల మూఢనమ్మకం ఓ గర్భిణిని పొట్టన పెట్టుకుంది. ఆమె కడుపులోని బిడ్డ లోకం చూడకుండానే కన్నుమూసింది.


