నియామక పత్రాలు అందజేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి వివేక్ వెంకటస్వామి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
247 మంది నర్సింగ్ అధికారులకు నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: వైద్యం, విద్యపై ప్రభుత్వం చేసే వ్యయం ఉచిత సంక్షేమం కాదని, రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచే మానవ వనరులపై దీర్ఘకాలిక పెట్టుబడని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రజల ఆరోగ్యం, నైపుణ్యాలను మెరుగుపరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) శాఖ ఆధ్వర్యంలో కొత్తగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు శుక్రవారం హైదరాబాద్‌లోని సేవాలాల్ భవన్‌లో కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పదేళ్లుగా కార్మికుల కనీస వేతనాల సవరణ నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ప్రస్తుతం కార్మిక శాఖ ప్రత్యేక చొరవతో దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణకు జీవోలు జారీ చేయడం అభినందనీయమన్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా గ్రీన్ చానల్ ద్వారా రూ.30 కోట్ల విడుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
వైద్య సేవలను బలోపేతం చేసేందుకు త్వరలోనే 120 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 6 మంది డెంటల్ సివిల్ సర్జన్లు, 99 మంది ఫార్మసిస్టులు, 34 మంది ల్యాబ్ టెక్నీíÙయన్లు, 54 మంది ఏఎన్‌ఎంలు సహా ఇతర పారామెడికల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత చేరువ చేయడానికి సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రితో పాటు ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్‌లో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.


