మళ్లీ కోవిడ్‌ వ్యాప్తి! | Over 340 new Covid cases registered across the country | Sakshi
Sakshi News home page

మళ్లీ కోవిడ్‌ వ్యాప్తి!

Jul 18 2026 4:24 AM | Updated on Jul 18 2026 4:24 AM

Over 340 new Covid cases registered across the country

ఏపీలో నలుగురు మృతి, 13 యాక్టివ్‌ కేసులతో కలకలం 

దేశవ్యాప్తంగా 340కిపైగా కొత్త కేసులు నమోదు 

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో మళ్లీ కోవిడ్‌ వ్యాప్తి వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 340కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో జూన్‌ 26 నుంచి శుక్రవారం వరకు నలుగురు కోవిడ్‌తో మృతిచెందగా మొత్తం 13 కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు రికార్డయ్యాయి. అయితే కోవిడ్‌ బారినపడిన రోగులంతా స్వల్ప లక్షణాలతో హోమ్‌ ఐసోలేషన్‌లోనే కోలుకుంటున్నారని.. తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నందునే ఏపీలో నలుగురు రోగులు మృతిచెందారని వైద్యులు నిర్ధారించారు. తాజా కేసులు కొత్త కోవిడ్‌ వేవ్‌కు లేదా మహమ్మారి విజృంభణకు సూచికలు కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, వైరస్‌లో స్వల్ప మార్పులు (మ్యుటేషన్లు) జరగడం వల్ల అక్కడక్కడా క్లస్టర్లుగా మాత్రమే ఈ కేసులు నమోదవుతున్నాయని వైద్య శాఖ వెల్లడించింది. అయితే ఈ కేసులు వేగంగా వ్యాపించే ఒమిక్రాన్‌ సబ్‌–వేరియంట్‌ వల్ల వచ్చి ఉంటాయనే అనుమానంతో అధికారులు నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రజారోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్య నిపుణులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

అందరికీ వ్యాక్సినేషన్‌ ద్వారా రోగనిరోధక శక్తి పెరగడం వల్ల తీవ్రమైన ప్రమాదం తప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని.. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం ఉత్తమమని చెబుతున్నారు. 

తెలంగాణలో కోవిడ్‌ వ్యాప్తి లేదు 
తాజా పరిణామాలపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ స్పందించింది. రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి చెందుతున్నట్లు ఎలాంటి అధికారిక హెచ్చరికలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడం వల్ల తెలంగాణలో వైరల్‌ జ్వరాలు, ఫ్లూ, దగ్గు, జలుబు వంటి సాధారణ సీజనల్‌ వ్యాధులే నమోదవుతున్నాయని వైద్యులు వెల్లడించారు. 

వైరల్‌ ఇన్ఫెక్షన్‌ కేసుల్లోనూ కోవిడ్‌ లక్షణాలు ఉంటాయి కాబట్టి సీజనల్‌ రెస్పిరేటరీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ లక్షణాలు తీవ్రమై శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైతే వైద్యులను సంప్రదించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్‌పై ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  – డాక్టర్‌ హరికిషన్‌ గోనుగుంట్ల, చీఫ్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్ట్, యశోద హాస్పిటల్స్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement