కాంగ్రెస్ ‘యూత్ డిక్లరేషన్’ వైఫల్యాలే ప్రధాన అస్త్రం
నిరుద్యోగులు, విద్యార్థులకు చేరువయ్యేలా వ్యూహం
సరూర్ నగర్ సదస్సుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై సమర శంఖం పూరించిన బీఆర్‌ఎస్ పార్టీ శనివారం సరూర్‌నగర్ స్టేడియం వేదికగా ‘యువ సంగ్రామ సదస్సు’ను నిర్వహిస్తోంది. పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు హాజరయ్యేలా ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుని బీఆర్‌ఎస్ ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. యువ సంగ్రామ సదస్సు నిర్వహణకు సంబంధించి సుమారు పది రోజుల క్రితం నుంచే బీఆర్‌ఎస్ సన్నాహాలు ప్రారంభించింది.
అయితే చివరి నిమిషం వరకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో శుక్రవారం పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సదస్సు నిర్వహణకు సంబంధించి పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, స్పోర్ట్స్ అథారిటీకి తాము దరఖాస్తు చేసుకున్నా అనుమతి ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం యువ సంగ్రామ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం అనుమతులిచి్చంది. పార్టీ యువజన విభాగం అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి తదితరులు సరూర్ నగర్ స్టేడియంలో సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఆరు డిక్లరేషన్లపై సమరభేరి
2023 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2022 మే మొదలుకుని 2023 నవంబరు వరకు ఆరు డిక్లరేషన్లు విడుదల చేసింది. వరంగల్‌లో 2022 మే 6న జరిగిన ‘రైతు డిక్లరేషన్’ సభకు రాహుల్ గాం«దీ, హైదరాబాద్‌లో 2023 మే 9న జరిగిన ‘యూత్ డిక్లరేషన్’సభకు ప్రియాంక గాందీ, చేవెళ్లలో 2023 ఆగస్టు 26న జరిగిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , 2023 నవంబర్ 9న హైదరాబాద్‌లో జరిగిన ‘మైనారిటీ డిక్లరేషన్’ సభకు మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, నవంబర్ 10న కామారెడ్డిలో జరిగిన ‘బీసీ డిక్లరేషన్’ సభకు అప్పటి కర్ణాటక సీఎం సిద్దరామయ్యలు హాజరయ్యారు. ఈ సభల్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డిక్లరేషన్ల వారీగా సమరభేరీ మోగించాలని, ఆయా తేదీల్లో సభలు జరిగిన చోటే పోటీ సభలు లేదా సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సరూర్‌నగర్ స్టేడియంలో నేడు బీఆర్‌ఎస్ నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా.. శనివారం ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు సదస్సును నిర్వహించాలని షరతు విధించింది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, శాంతిభద్రతల సమస్యలు లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించింది.
యువ సంగ్రామ సదస్సుకు అనుమతివ్వాలని, ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్, ఎల్‌బీ నగర్ డీసీపీ, ఏసీపీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ప్రతివాదులుగా చేరుస్తూ లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ టీ.మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది.వాదనలు విన్న న్యాయమూర్తి సదస్సుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


