మీ కుటుంబంలోని నలుగురు తెలంగాణకు ఏం ఇచ్చారు?: రేవంత్‌ | CM Revanth Slams KCR | Sakshi
Sakshi News home page

మీ కుటుంబంలోని నలుగురు తెలంగాణకు ఏం ఇచ్చారు?: రేవంత్‌

Jul 18 2026 8:03 PM | Updated on Jul 18 2026 8:27 PM

 CM Revanth Slams KCR

ఘట్‌కేసర్‌: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణకు రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పులు ఎలా అయ్యాయి? అని అన్నారు. 16 ఏళ్ల పాటు గ్రూప్‌-1 ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.

ఘట్‌కేసర్‌లో అందెశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మీ కుటుంబంలోని నలుగురు తెలంగాణకు ఏం ఇచ్చారు? నిజాంల కంటే ఆస్తిపరులు ఎలా అయ్యారు? తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ గళమెత్తారు. నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ నాకు స్ఫూర్తిగా నిలబడేవారు. అందెశ్రీ పాటలు తూటాలై, మరఫిరంగులై గడీలను బద్దలు కొట్టాయి.

ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించాం. కానీ, గత పదేళ్లలో కుట్రలతో ఆయన పాటను వినిపించకుండా చేశారు. ఇప్పుడు తెలంగాణలోని ప్రతి బడిలో, ప్రతి గడపలో ఆయన పాట వినిపిస్తోంది.

ఏ రోజైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో.. గద్దరన్నను అవమానించారో ఆనాడే  గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని నిర్ణయించుకున్నారు. మేక తోలు కప్పుకున్న తోడేలు ఇవాళ మాట్లాడుతోంది. ఈ తోడేళ్ల గుంపును నేను ప్రశ్నిస్తున్నా.. ఆనాడు కవితను, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే ఉద్యోగాలు ఇచ్చినవ్ కదా? 

తెలంగాణ బిడ్డల ఉద్యోగాల కోసం ఒక్కనాడైనా ఆలోచించారా? మేం నోటిఫికేషన్లు ఇచ్చినం రేవంత్ రెడ్డి భర్తీ చేశారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నావ్. పేపర్ లీకేజీలతో వందల కోట్లు సంపాదించుకున్నారు తప్ప.. పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేయాలని మీ కుటుంబం ఏనాడైనా ఆలోచించిందా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement