కాంగ్రెస్‌కు 'డెత్ డిక్లరేషన్' రాయాలి: కేటీఆర్‌ | BRS KTR Sensational Comments On Congress And Revanth Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు 'డెత్ డిక్లరేషన్' రాయాలి: కేటీఆర్‌

Jul 18 2026 1:17 PM | Updated on Jul 18 2026 1:25 PM

BRS KTR Sensational Comments On Congress And Revanth Reddy

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలతో యువతను మోసం చేసిందని, ఆ మోసానికి సమాధానం చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యువత పిడికిలి బిగిస్తే పీఠాలు కదులుతాయి. కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా డెత్ డిక్లరేషన్ రాయాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. నిరుద్యోగుల సమస్యలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రచారానికే పరిమితమైందని మండిపడ్డారు.

సరూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌ తలపెట్టిన 'యువ సంగ్రామ సభ'లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ మోసం చేసిన సరూర్‌నగర్‌లోనే 'యువ సంగ్రామ సభ' నిర్వహించాం. 38 నెలల క్రితం కాంగ్రెస్ మాటలు నమ్మి యువత దగా పడింది. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదు. అసెంబ్లీలో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అమలు కాలేదు. అది చిత్తు కాగితంగా మారింది. ప్రభుత్వం 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా. ఇదే నా సవాల్. వాస్తవానికి 10 వేల ఉద్యోగాలు కూడా కాంగ్రెస్‌ ఇవ్వలేదు.

నిరుద్యోగుల సమస్యలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా?. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రచారానికే పరిమితమైంది. రేవంత్‌ ప్రభుత్వం క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తోంది. గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలకూ తమదే ఘనతగా చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ భృతి, స్కూటీల పంపిణీ వంటి హామీలు అమలు కాకపోగా, లూటిఫికేషన్ మాత్రమే జరుగుతోందని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నుంచి గాంధీలు, గాంధీ భవన్ నుంచి గాడ్సేలు వచ్చారు. రాష్ట్రంలో ఉన్మాద పర్వం నడుస్తోంది. పాత కేటుగాళ్ళు, కొత్త డూప్లికేట్ గాళ్ళు యువతను మోసం చేశారు. మోసం చేసిన వాళ్లను ఏమని అందాం. 60 ఏళ్ళు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ మాటలు నమ్మాం. అందరి కాళ్లు మొక్కి నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. రేవంత్ రెడ్డి భాషలో బెల్ట్ ట్రీట్మెంట్ ఇద్దామా? లాగులో తొండలు విడుద్దామా?. యువతతో పెట్టుకుంటే పుట్ట గతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీకి డెత్ డిక్లరేషన్ రాయాలి. రాహుల్ గాంధీ జేబులు రేవంత్ రెడ్డి నింపుతున్నారు. అన్నదమ్ముళ్ల అల్మారాలు నింపుతున్నారు.

తెలంగాణ విద్యార్థుల గుండెల్లో బుల్లెట్లు దింపింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ రక్త పిశాచి. రక్తం పంట పొలాల్లో చల్లాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు దొంగ. 50 లక్షలతో అడ్డంగా రేవంత్ రెడ్డి దొరికారు. క్రెడిట్ చోరీ చేయడానికి సిగ్గు అనిపించడం లేదా?. అబద్దాలు చెప్పడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఓటుకు నోటు దొంగ కుర్చీలో కూర్చున్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి బిస్కెట్లు తిని మనకు బిస్కెట్లు వేసి పోయారు’ అంటూ సెటైర్లు వేశారు. 

ఉద్యోగాలు ఇవ్వాలని నిరసన తెలిపితే బూతులు తిడుతున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే ఎండ్రిన్‌ తాగి చావమంటావా?. ఉద్యోగాలు ఎందుకు ఇ‍వ్వరు.. మీ అయ్య జాగీరా?. ప్రజలు హామీలపై ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడుతున్నారు. నమ్మించి మోసం చేయడంలో రేవంత్‌ పీహెచ్‌డీ చేశారు. తెలంగాణలో భూములు, బూడిద, ఇసుక లూటిషికేషన్‌ జరుగుతోంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో ప్రపంచంలోనే అతి పెద్ద మోసం. బీఆర్‌ఎస్‌ కట్టిన ఫ్లైఓవర్లకు రేవంత్‌ సున్నాలు దిద్దుతున్నారు. మనం తెచ్చిన కంపెనీలకు రేవంత్‌ రిబ్బన్‌ కటింగ్‌ చేస్తున్నాడు. బడేభాయ్‌ రెండు కోట్లు, చోటా భాయ్‌ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను రాజు నేను హిట్లర్‌ అంటూ బట్లర్‌ మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ అధికార పీఠం.. నిరుద్యోగులకు బలిపీఠం’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement