హైదరాబాద్: రహదారులు రుధిర ధారలుగా మారాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గ్రేటర్ పరిధిలో గురువారం అర్ధరాత్రి, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు పాఠశాల విద్యార్థి, మరొకరు ఇంటర్మీడియట్ విద్యార్థి, ఓ మహిళ ఉన్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..
మేడ్చల్‌లో బైక్‌ను ఢీకొట్టడంతో..
నగర శివారు ఐడీపీఎల్ దిల్‌కుష్‌నగర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సొహైల్ (18), కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థి సుమిత్ గైక్వాడ్ (17) గురువారం అర్ధరాత్రి మేడ్చల్ నుంచి కొంపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. మార్గంమధ్యలో ఓఆర్‌ఆర్ అండర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో సొహైల్, సుమిత్ గైక్వాడ్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
కీసర ఓఆర్‌ఆర్‌పై..
మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన రషీద్ (40) మటన్ షాప్ యజమాని. అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాములు (60), గౌస్ కలిసి బొలేరో వాహనంలో గొర్రెల లోడ్‌తో నగర శివారు చెంగిచర్లలోని మండీకి వెళ్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు నిద్ర రావడంతో కీసర ఓఆర్‌ఆర్‌పై రాంపల్లి దాయర వద్ద బొలేరో వాహనాన్ని ఎడమ వైపు ఆపి నిద్రించారు. గుర్తు తెలియని వాహనం వెనక నుంచి వచ్చి బొలేరో వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది. వాహనంలో నిద్రిస్తున్న రషీద్, రాములు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. గౌస్‌కు కాలు విరిగింది. వాహనంలోని కొన్ని గొర్రెలు సైతం మృతిచెందాయి. మృతుడు రషీద్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. రాములుకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కీసర సీఐ
ఆంజనేయులు చెప్పారు.
మెట్రో పిల్లర్‌ను బైక్ ఢీ..
జగిత్యాల జిల్లా బీజ్‌పూర్ మండలం నర్సింహుల పల్లె గ్రామానికి చెందిన చెర్పూరి అఖిలేష్ యాదవ్ (24) నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటూ ఆస్పత్రిలో ఎలక్ట్రిషియన్‌గా పని చేస్తున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన మహమ్మద్ యూనిస్ (26) ప్రైవేట్ ఉద్యోగ చేస్తూ ఇక్కడి హాస్టల్‌లో ఉంటున్నాడు.
వీరిద్దరూ కలిసి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్‌పై జేఎన్‌టీయూ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కూకట్‌పల్లి భాగ్యనగర్ బస్టాప్ వద్ద వీరి బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టడంతో అఖిలేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న మహమమ్మద్ యూనిస్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అఖిలేష్ తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


