హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య కార్డుల అమలుకు శ్రీకారం చుట్టడం పట్ల ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన, నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక చొరవ తీసుకుని ఆరోగ్య కార్డుల అమలును వేగవంతం చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ చైర్మన్ లచ్చిరెడ్డి, ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఈహెచ్‌సీటీ ట్రస్ట్ మెంబర్ దేవరకొండ సైదులు, ఎస్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యూ. పోచయ్య, ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు & ఈహెచ్‌సీటీ ట్రస్ట్ మెంబర్ సదానందం గౌడ్, పెన్షనర్ల అసోసియేషన్ చైర్‌పర్సన్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆదర్శప్రాయమని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ఉద్యోగులు, పెన్షనర్ల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.


