ఎల్లారెడ్డిపేట: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాన్వాయ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్‌లో వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం హరిదాస్‌నగర్ నుంచి గంభీరావుపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాదంలో కార్ల ముందు, వెనుక భాగాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ముప్పు తప్పింది. స్వల్ప ప్రమాదం అనంతరం యథావిధిగా బండి సంజయ్ కాన్వాయ్ ప్రయాణం కొనసాగింది.
అంతకుముందు సిరిసిల్లలో రూ. 105 కోట్లతో కార్గిల్ చెరువు పునరుద్ధరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ అభివృద్ధి కోసం నిధులిస్తే...జీతాలకు, కరెంట్ బిల్లులకు మళ్లిస్తారా?, ఆర్ధిక సంఘం నిధులను దారి మళ్లిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వ తీరు మార్చుకోవాలి.
లేనిపక్షంలో కేంద్ర నిధులను నేరుగా పంచాయతీ అకౌంట్లలోనే జమ చేసే అంశాన్ని పరిశీలిస్తాం. కేంద్రానికి లేఖ రాస్తా. గడువులోగా అమృత్ పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవు. నిధులు వెనక్కువెళ్లే ప్రమాదం ఉంది. కేంద్ర నిధులతోనే తెలంగాణాలో అభివృద్ధి జరుగుతోంది’ అని స్పష్టం చేశారు.


