సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. రేపటి బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సభకు అనుమతి లభించలేదు. బీఆర్‌ఎస్ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని బీఆర్‌ఎస్ నేతలు సుధీర్ రెడ్డి, శంభీపూర్ రాజు చెప్పుకొచ్చారు. దీంతో, సభ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. కావాలనే అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ..‘యువ సంగ్రామ సదస్సుపై కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. రేపటి సరూర్ నగర్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక అనుమతులు నిరాకరించారు. సీఎంవో మేరకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు. సభను అడ్డుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వెనుక సీఎంవో కార్యాలయం ప్రత్యక్ష ప్రమేయం ఉంది. యువ గొంతును అణిచివేసేందుకు పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోవడం దురదృష్టకరం.
ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా యువత కోసం వెనకడుగు వేసేది లేదు. భారీగా తరలివచ్చే యువతను అడ్డుకునేందుకే ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. శాంతియుత సభకే అనుమతి నిరాకరించడం ఎందుకు?. యువత సమస్యలపై చర్చకు ప్రభుత్వం భయపడుతోందా?. అనుమతుల నిరాకరణపై కోర్టును ఆశ్రయిస్తాం. పోలీసుల తీరుపై న్యాయపోరాటానికి సిద్ధం’ అని చెప్పుకొచ్చారు.


