తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం నిత్యం ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. అది క్రమేపి రాజకీయ రూపు దాల్చుతోంది. ఆ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల వ్యవహారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య మాటల యుద్దానికి తెరదీసింది. ఒక వైపు వానలు అంతంత మాత్రంగా ఉండడం, మరో వైపు కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు వస్తాయో, రావో అన్న సందిగ్దత గందరగోళంగా మారింది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేసినప్పటికీ మెడిగడ్డ వద్ద కొన్ని పిల్లర్లు కుంగడంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చాలా డామేజి జరిగింది.
2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్‌ఎస్ ఓటమిలో ఆ సమస్య కూడా ఒక కారణం అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎలాంటి విధానం అనుసరించాలన్నదానిమీద సరైన క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నదన్న విమర్శ వస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఏర్పడిన పగుళ్లనండి. లేదా పిల్లర్లు కుంగడం అనండి.. ఏదైనా కానివ్వండి.. గ్రౌండ్ సిచ్చుయేషన్‌కు అనుగుణంగా నిర్ణయాలు చేసి రేవంత్ తనకు అడ్వాంటేజ్ తెచ్చుకునే అవకాశం ఒక దశలో ఉంది.
ఆ ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందని నేషనల్ డామ్ సేఫ్టి అథారిటి చెబుతోందన్నది ఆయన వాదనగా ఉంది. ఇందులో స్కామ్ అని, మరొకటి అని చెప్పి గత రెండేళ్లుగా అలాగే ఉంచేశారు. ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావులను అరెస్టు చేస్తారేమో అన్నంతగా ప్రచారం జరిగింది. కాని వారు న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ పొందగలిగారు. కమిషన్ రిపోర్టుకు కూడా పెద్ద విలువ లేకుండా పోయిందనిపిస్తుంది. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద నీరు నిల్వచేసి పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని తోడి ఆయా ప్రాంతాలలో ఉన్న రిజర్వాయిర్‌లను నింపాలా? వద్దా? అన్న చర్చకు పరిస్థితి చేరింది. ఇక్కడే రేవంత్ ప్రభుత్వం పొరపాటు చేస్తున్నదా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లి, అక్కడ నీటిని తోడకపోతే తామే మోటార్లను ఆన్ చేస్తామని హెచ్చరించారు. తనకు ఇరిగేషన్ మంత్రి పదవి అప్పగిస్తే, మూడునెలల్లో బారేజీలను బాగు చేయించి చూపుతానని హరీష్‌రావు సవాల్ చేశారు. వీటికి ప్రతిగా రేవంత్ కూడా ధీటుగానే బదులు ఇచ్చారు. అది వేరే విషయం.
నిజానికి ఇంతదాకా రేవంత్ ప్రభుత్వం వెళ్లనిచ్చి ఉండాల్సింది కాదు. ఒక వైపు వర్షాభావ పరిస్థితులు ఆయా జిల్లాలను ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు నీరు ఎలా ఇవ్వవచ్చా అన్నదానిపై ఆలోచన చేసి ఉండాల్సింది. కేసీఆర్ కట్టించినంత మాత్రాన ఆ ప్రాజెక్టు ఆయనది అయిపోదు. అలాగే ఆరోపణలు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టుతో రేవంత్‌కు సంబంధం ఉండకపోదు. అది ప్రజల ఆస్తి.
ఈ క్రమంలోనే వాదోపవాదాలు, విమర్శ, ప్రతి విమర్శలకు అవకాశం ఇచ్చారు. కాళేశ్వరం నీరు ఎత్తిపోయకుండా పగ పట్టారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి బదులుగా నీళ్లు ఉన్నంత మాత్రాన ఎత్తిపోయలేం అని, నీటి నిల్వకు ఆ బారేజీలు అనువుగాదని జాతీయ డామ్ భద్రత అథారిటీ చెబుతోందని, బరాజ్‌లు సురక్షితం కాదని కూడా ఆ సంస్థ చెప్పిందని రేవంత్ అన్నారు. అది నిజమే కావచ్చు. కాని అందుకు ప్రత్యామ్నాయం ఏమిటో ఆలోచించకపోతే, రైతుల పొలాలకు నీరందించలేకపోతే, వర్షాలు సరిగా కురవకపోతే ఆ ప్రభావం అంతా తన ప్రభుత్వంపైనే పడుతుందన్న సంగతి ఆయన గుర్తించాలి.
అంతేకాక విపక్షాన్ని ఉద్దేశించి పొలాలలో రక్తం చల్లితే పంటలు పండుతాయని అనడం సరికాదు. ఎదుటి పక్షం వారు ఎదైనా చిన్న వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తేనే కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో ఏపీ కంటే తెలంగాణ కాస్త బెటర్ అయినా, ఈ మధ్య జరిగిన కొన్ని అరెస్టులు చూస్తే, ఇక్కడ కూడా టీడీపీ పెత్తనం సాగుతోందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గత కొన్నాళ్లుగా తీవ్ర అసహనంతో మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తద్వారా ఆయనలో ఉన్న ఫ్రస్టేషన్‌ను బయటపెట్టుకుంటున్నారు. తెలంగాణలో ఆయన శిష్యుడుగా పేరొందిన రేవంత్ కూడా అదే బాటలో వెళ్లకుండా ఉంటే మంచిది.
రేవంత్ వ్యాఖ్యను బీఆర్‌ఎస్ తనకు అనుకూలంగా మలచుకుని, గోదావరి నీళ్లు రైతులకు అందిస్తామంటే తమ రక్తం ఇస్తామంటూ పెద్ద హడావుడినే సృష్టించింది. తెలంగాణ భవన్‌లో భారీగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. కేసీఆర్‌ను ఎలాగైనా ఇరిటేట్ చేసి ముగ్గులోకి దించాలని రేవంత్ చూస్తున్నప్పటికి, ఆయన తొణకడం లేదు. కేటీఆర్, హరీష్‌రావులే గట్టిగా బదులు ఇస్తున్నారు. దీనివల్ల కూడా రేవంత్ అసహనానికి గురి అవుతున్నారేమో తెలియదు. రేవంత్ కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే దాని పునరుద్దరణపై పూర్తి శ్రద్ద పెట్టి ఉంటే ఆయనకు పేరు వచ్చేది.
కేసీఆర్‌ను విమర్శించవచ్చు. అందులో అవినీతి ఉంటే దానిపై దర్యాప్తు చేయించవచ్చు. కాని అల్టిమేట్‌గా ప్రజలకు కావల్సింది నీరు. అందులోను వర్షాభావ స్థితిలో తమ పొలాలకు నీటి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అందువల్ల బీఆర్‌ఎస్ కోరడానికి ముందే, గోదావరిలోకి వచ్చిన వరద నీటిని అంచనా వేసుకుని, పంప్ హౌస్‌ల ద్వారా నీరు లిఫ్ట్ చేయించడం మొదలు పెడితే బాగుండేదేమో! కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా దానినే సూచిస్తున్నారట. ఒక వేళ నిజంగానే గోదావరి నీటిని లిఫ్ట్ చేయడంలో ఇబ్బంది ఉంటే, విపక్షాన్ని కూడా ఆహ్వానించి, వారిని కూడా ఆయా బారేజీల వద్దకు, పంప్ హౌస్‌ల వద్దకు తీసుకువెళ్లి ఇరిగేషన్ అధికారుల ద్వారా పరిస్థితిని వివరించి ఉండవచ్చు. అలాగే మేధావులైన ఇంజనీర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కోసం ఒక సమావేశం పెట్టి ఉండవచ్చు. ఇవేవి చేసినట్లు లేరు. పైగా అనుచిత వ్యాఖ్య చేసి తనకు రావల్సిన మైలేజీని రేవంత్ వదులుకున్నారేమో అనిపిస్తుంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి ఆత్మరక్షణలో ఉన్న బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఊపిరి పోస్తుందనిపిస్తుంది. కారణం ఏమైనా కేసీఆర్ ప్రభుత్వం కూడా మెడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల పునరుద్దరణకు వేగంగా చర్యలు చేపట్టలేదన్న భావన ఉంది. ఒకప్పుడు గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఉన్న బారేజీ గేట్లు దెబ్బతిన్నాయి. దాంతో ఉభయ గోదావరి జిల్లాలకు తీవ్ర సంక్షోభం వచ్చే స్థితి ఏర్పడింది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు స్వయంగా ధవళేశ్వరం వెళ్లి, అక్కడే మకాం చేసి ఆ గేట్లను బాగుచేయడమో. కొత్త గేట్లను బిగించడమో చేశారట. దానివల్ల ఆయనకు ఖ్యాతి వచ్చింది.
1986లో వచ్చిన భారీ వరదలకు గోదావరి రెండువైపులా గట్లు పలుచోట్ల తెగిపోయాయి. ఆ నది వెంబడి ఉన్న జిల్లాలన్నీ మునిగిపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వం వెంటనే గోదావరి గట్లను పటిష్టపరిచే పని చేపట్టింది. అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమని చెబుతూ కాలం గడపలేదు. ఇలాంటి అనుభవాలు మరి కొన్ని కూడా ఉన్నాయి. కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. వాటిని ఎదుర్కుని ముందుకు పోవడంలోనే ప్రభుత్వ విజన్ కనిపిస్తుంది. కనుక ఇప్పటికైనా రేవంత్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉన్నా దానిని వినియోగించుకుంటే మంచిది. పాజిటివ్ దృక్పథంతోనే రేవంత్ ముందుకు వెళితే ఆయనకు మైలేజీ రావచ్చేమో!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


