ఎల్‌ నినో దెబ్బ.. గృహజ్యోతి లబ్ధిదారులకు షాక్‌! | El Nino Effect, Rising Power Usage Shocks Telangana Gruha Jyothi Beneficiaries Without Zero Bills, Check More Details | Sakshi
Sakshi News home page

ఎల్‌ నినో దెబ్బ.. గృహజ్యోతి లబ్ధిదారులకు షాక్‌!

Jul 17 2026 9:28 AM | Updated on Jul 17 2026 10:23 AM

El Nino Effect: Rising Power Usage Shocks Gruha Jyothi Beneficiaries

ఇది ఏఐ ఆధారిత ప్రతీకాత్మక చిత్రం

వానాకాలంలోనూ ఎండల సెగ తగ్గడం లేదు. ఎల్‌ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి పడిపోకపోవడంతో పాటు వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో.. విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగి మీటర్లు రయ్‌ రయ్‌ అంటూ పరుగులు పెడుతున్నాయి. దీంతో జీరో బిల్లు పొందుతున్న గృహజ్యోతి లబ్ధిదారులకు ఊహించని షాక్‌ తగులుతోంది.

గృహజ్యోతి పథకం(Telangana Gruha Jyothi Scheme) కింద నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించే కుటుంబాలకు మాత్రమే జీరో బిల్లు వర్తిస్తుంది. అయితే పెరిగిన కరెంట్‌ వినియోగంతో పలువురు లబ్ధిదారులు ఈ పరిమితిని దాటుతున్నారు. ఫ్యాన్లు, కూలర్ల వినియోగం తగ్గడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, నీటి మోటార్లను ఎక్కువ సమయం నడపాల్సి వస్తోంది. ఫలితంగా ఇప్పటివరకు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేని కుటుంబాలు.. ఒక్కసారిగా పూర్తి విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్‌పీడీసీఎల్‌) పరిధిలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సంస్థ పరిధిలోని 18 జిల్లాల్లో జూన్‌ నెలలోనే సుమారు 4 లక్షల మంది గృహజ్యోతి లబ్ధిదారులు పథక ప్రయోజనానికి దూరమయ్యారు. ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో మొత్తం 26.54 లక్షల మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉండగా.. జూన్‌లో 22.59 లక్షల మందికి మాత్రమే జీరో బిల్లులు వచ్చాయి. వీరికి ప్రభుత్వం రూ.99.18 కోట్ల సబ్సిడీని భరించింది.

మార్చి నుంచి జూన్‌ వరకు ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో 6.49 కోట్ల జీరో బిల్లులు జారీ అయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.2,355 కోట్ల సబ్సిడీని అందించింది. అయితే వాతావరణ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో జీరో బిల్లు పొందే వారి సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో విద్యుత్‌ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. గత మూడు నెలల్లో 5,384 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం నమోదైంది. ఇందులో ఒక్క జూన్‌ నెలలోనే 1,612.270 మిలియన్‌ యూనిట్ల కరెంట్‌ వినియోగించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో గతేడాది జూన్‌తో పోలిస్తే ఈసారి విద్యుత్‌ వినియోగం దాదాపు 70 శాతం పెరగడం గమనార్హం.

ఎల్‌ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు, విద్యుత్‌ వినియోగం ఇదే స్థాయిలో కొనసాగితే.. జూలైలోనూ 200 యూనిట్ల పరిమితిని దాటే కుటుంబాల సంఖ్య పెరిగి, మరింత మంది గృహజ్యోతి ప్రయోజనానికి దూరమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement