బీఆర్‌ఎస్ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ | Telangana High Court has granted permission for the BRS meeting | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Jul 17 2026 4:14 PM | Updated on Jul 17 2026 4:23 PM

Telangana High Court has granted permission for the BRS meeting

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్‌ఎస్ అనుబంధ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రేపు (శనివారం, జూలై 18) నిర్వహించ తలపెట్టిన ‘యువ సంగ్రామ సదస్సు’కు తెలంగాణ హైకోర్టు అనుమతిని ఇచ్చింది.  

ఈ సభ నిర్వహణ కోసం బీఆర్‌ఎస్ నేతలు జూన్ 30నే దరఖాస్తు చేసుకున్నప్పటికీ, శాంతిభద్రతలు, ఇంటెలిజెన్స్ నివేదికల నెపంతో పోలీసులు చివరి నిమిషంలో అనుమతిని నిరాకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే సభను అడ్డుకుంటోందని మండిపడ్డ బీఆర్‌ఎస్ లీగల్ సెల్, దీనిపై అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న న్యాయస్థానం.. కొన్ని షరతులతో కూడిన అనుమతులను మంజూరు చేస్తూ సభ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ‘యూత్ డిక్లరేషన్’ హామీలను (మెగా డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి) నెరవేర్చడంలో విఫలమైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఎన్నికల ముందు ఇదే సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ సమక్షంలో ‘యూత్ డిక్లరేషన్’ ప్రకటించగా, ఇప్పుడు అదే వేదిక నుండి కాంగ్రెస్ వైఫల్యాలపై ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.

 ఈ సభకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, నిరుద్యోగ యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు. హైకోర్టు అనుమతితో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement