ధరణిని 'సెట్‌' చేద్దాం | Minister Ponguleti Srinivasa Reddy reveals cabinet decisions | Sakshi
Sakshi News home page

ధరణిని 'సెట్‌' చేద్దాం

Jul 18 2026 1:28 AM | Updated on Jul 18 2026 1:28 AM

Minister Ponguleti Srinivasa Reddy reveals cabinet decisions

మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

సమగ్ర విచారణ బృందం ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం

ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన రోజునుంచి ఈరోజు వరకు జరిగిన భూ లావాదేవీల పరిశీలన

అక్రమాలు తేలితే కఠిన చర్యలకు తీర్మానం..

మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి 

ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో 10 వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి 

పాత సాఫ్ట్‌వేర్‌లో లోపాలతో భూభారతి వచ్చాక కూడా అవకతవకలు  

అన్నిటిపైనా ‘సెట్‌’ బృందం దృష్టి పెడుతుంది 

ఎల్‌నినోపై అప్రమత్తం కావలసిందే.. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి 

తాగునీటి విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్న పొంగులేటి

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన రోజు నుంచి ఈరోజు వరకు జరిగిన భూ లావాదేవీలు, రికార్డుల మార్పులు, భూముల బదలాయింపులు, అక్రమాల ఆరోపణలపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (ఎస్‌ఈటీ) ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 2020 అక్టోబర్‌ 29 నుంచి అమల్లోకి వచ్చిన ధరణి, భూభారతి పోర్టల్‌లో జరిగిన అన్ని అనుమానాస్పద లావాదేవీలను లోతుగా పరిశీలించి, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర 36వ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లతో కలిసి మీడియాకు వెల్లడించారు.  

ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో వెలుగులోకి..
‘ధరణి పోర్టల్‌ అమలులోకి వచ్చిన 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయాలని వచ్చిన సూచనల మేరకు కేరళకు చెందిన ఓ సంస్థకు ఆడిట్‌ పనులు అప్పగించాం. ముందుగా సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లావాదేవీలపై ఆడిట్‌ చేస్తే దాదాపు 10 వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిపైనా విచారణ జరిపేందుకు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేస్తాం. ఆ బృందం మొత్తం ఆరేళ్లలో జరిగిన అక్రమాలను సమగ్రంగా విచారిస్తుంది. ధరణి కోసం టెండర్లు పిలిచిన దగ్గరి నుంచి ఇప్పటి భూభారతి వరకు విచారణ జరుపుతుంది. భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ భూములు, అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ భూముల బదలాయింపులు, డిజిటల్‌ రికార్డులు, లాగిన్‌ వివరాలు, అధికారులు ఇచ్చిన అనుమతులు, భూముల వర్గీకరణలో చేసిన మార్పులు, లబ్ధిదారుల వివరాలు తదితర అంశాలన్నింటినీ విచారణ పరిధిలోకి తీసుకుంటారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థ పాత్రతో పాటు, టెండర్ల ప్రక్రియ, పోర్టల్‌ రూపకల్పన, కాంట్రాక్టు కేటాయింపు, సిస్టమ్‌ ఆర్కిటెక్చర్, డేటా భద్రతలో లోపాలు, సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనలో జరిగిన తప్పిదాలపైనా ఎస్‌ఈటీ దృష్టి పెడుతుంది. ధరణిలోని లోపాలను సవరించి భూభారతి వ్యవస్థను ప్రభుత్వం అమల్లోకి తెచ్చినప్పటికీ, పాత సాఫ్ట్‌వేర్‌లోని లోపాల వల్ల ఇప్పటికీ అవకతవకలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారో, ఎందుకు చేశారనే అంశాలను విచారించడంతో పాటు బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించం. చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం..’ అని మంత్రి చెప్పారు. 

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై కేంద్రానికి లేఖ 
‘రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికతో కూడిన లేఖ పంపాలని నిర్ణయించాం. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే 30 నుంచి 35 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. వ్యవసాయం, పశుసంవర్ధక రంగం, తాగు, సాగునీరు, గ్రామీణ ఉపాధి, విద్యుత్‌ రంగాలపై పడుతున్న ప్రభావాన్ని కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించాం.  ఈ నెల 20న ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రులు, ఆ జిల్లాకు కేటాయించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారితో కలిసి ఆ జిల్లా ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. సమీక్ష తరువాత ప్రతి జిల్లాకు ఒక నివేదిక రూపొందిస్తారు. ఆ నివేదికలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలించి సమీక్షించిన తర్వాత కరువు పరిస్థితులను కేంద్రానికి వివరిస్తాం. క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలని, ఎల్‌నినో కంటింజెన్సీ ప్రణాళికల అమలుకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కోరతాం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

నిరంతర విద్యుత్‌ సరఫరా 
రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని నిర్ణయించాం. ఒక్క నిమిషం కూడా విద్యుత్‌ కోత లేకుండా నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంతో పాటు అవసరమైతే కొనుగోలు చేయాలని అధికారులకు సూచించాం. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యంగా కేటాయించాలని కూడా నిర్ణయించాం. అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులతో ప్రత్యేక అధ్యయన నివేదిక రూపొందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఉమ్మడి పది జిల్లాల్లో రైతులు చేపట్టాల్సిన పంటల మార్పు, పశువుల సంరక్షణ, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై శాస్త్రవేత్తలతో కలిసి పర్యటించి, జిల్లాల వారీగా నివేదిక రూపొందించి తదనుగుణంగా శాస్త్రీయ మార్గదర్శకాలు సిద్ధం చేస్తారు. అలాగే శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు ఎల్‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలని నిర్ణయించాం..’ అని పొంగులేటి తెలిపారు. 

పంచాయతీల నిధుల నిర్వహణలో మార్పు 
‘గ్రామ పంచాయతీల సొంత నిధుల నిర్వహణలో కీలక మార్పునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు వసూలు చేసే పన్నులు, ఇతర ఆదాయాలను ట్రెజరీలో జమ చేసే విధానం అమల్లో ఉంది. దీని స్థానంలో సమీపంలోని జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో డిపాజిట్‌ చేసుకునేలా తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2018లో సవరణకు ఆమోదం తెలిపాం. దీంతో గ్రామపంచాయతీలకు సంబంధించిన నిధుల నిర్వహణ మరింత సులభతరం అవుతుంది. 

టెండర్లలో పారదర్శక విధానం కోసం కమిటీ 
ప్రభుత్వ ఇంజినీరింగ్‌ పనుల్లో పరిపాలన అనుమతులు, అంచనా వ్యయాలు, భూసేకరణ, టెండర్లు, బిల్లుల చెల్లింపుల వరకు ఒకే విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇంజనీరింగ్‌ పనులకు 2003లో తీసుకొచ్చిన జీవో 94 కీలకంగా ఉండేది. అన్ని టెండర్లు ఆ జీవోకు అనుగుణంగా ఉండేవి. అయితే 23 ఏళ్లలో ఆయా శాఖలు తమ పరిధిలో జరిగే పనులకు అనుగుణంగా జీవోలు మార్చి టెండర్ల ప్రక్రియను ఇష్టానుసారంగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉండేలా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సంస్థలు, నిపుణుల సూచనల మేరకు టెండర్ల ప్రక్రియను ఒకే గొడుగు కిందకు తెచ్చేలా చట్టం చేయాలని తీర్మానించింది..’ అని మంత్రి వెల్లడించారు. 

కోఆప్టెడ్‌ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లు 
‘మున్సిపల్‌ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లను కో–ఆపె్టడ్‌ సభ్యులుగా నియమించేందుకు తెలంగాణ మున్సిపాలిటీల చట్టం–2019లో సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న ఐదుగురు కో–ఆప్షన్‌ సభ్యులకు తోడుగా ఒక ట్రాన్స్‌జెండర్‌ను నియమించాలని నిర్ణయించాం.  
హైదరాబాద్‌–ముంబై, హైదరాబాద్‌–బెంగళూరు, హైదరాబాద్‌–అమరావతి–తిరుపతి–చెన్నై హైస్పీడ్‌ రైలు కారిడార్ల అలైన్‌మెంట్లు, స్టేషన్లపై ఆర్‌అండ్‌బీ శాఖ కేబినెట్‌కు వివరించగా, శంషాబాద్‌ సమీపంలో రైల్‌ హబ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  
⇒ అలాగే జలయజ్ఞంలో భాగంగా నాటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్‌ రెడ్డి ప్రణాళికలో భాగంగా గోదావరి నదిపై కన్నెపల్లి నుంచి 4.50 టీఎంసీల నీటిని ఎత్తిపోసి మంథని నియోజకవర్గంలోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందించే ముక్తేశ్వర్‌ ఎత్తిపోతల పథకం (చిన్న కాళేశ్వరం) పూర్తి చేయడానికి కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  
⇒ ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, కొత్తగా 29 పోస్టులకు ఆమోదం తెలిపింది..’ అని పొంగులేటి వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement